మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్: మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ 

మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్: మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ 

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: అహింస, సత్యం, ఆత్మనిగ్రహం వంటి భగవాన్ మహావీరుని సూత్రాలు సమాజానికి ఆదర్శమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. జైన మత స్థాపకులు, 24వ తీర్థంకరులైన భగవాన్ మహావీరుని 2625వ జయంతిని పురస్కరించుకుని శ్రీ జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లో మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

బేగంబజార్ ఫీల్ ఖానా జైన్ మందిరం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపులో భగవాన్ మహావీర్ ప్రధాన రథం, శకటాలు, సంప్రదాయ దుస్తుల్లో భక్తులు, సంగీత బృందాలు, గుర్రపు బగ్గీలు, యువతుల స్కూటర్ ర్యాలీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌‌‌లో జరిగిన మహావీర్ జయంతోత్సవాలను మంత్రి అజారుద్దీన్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గంగా-జమునీ తెహజీబ్‌‌‌‌కు ప్రతీకగా నిలిచి అన్ని మతాలను గౌరవించే సంస్కృతిని కొనసాగిస్తోందన్నారు. 

మహావీరుని బోధనలు మార్గదర్శకం: హరీశ్​రావు

‘అహింస పరమో ధర్మః’ అనే మహావీరుని సందేశం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన జీవన విధానమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. హింస, ద్వేషం పెరుగుతున్న ఈ కాలంలో మహావీరుని బోధనలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వీహెచ్​పీ మాజీ ఉపాధ్యక్షులు హుకుంచంద్‌‌‌‌జీ సావ్లా, తెలంగాణ మైనారిటీల కమిషన్ సభ్యుడు హిమాన్షు బాప్నా, జైన్ సేవా సంఘ్ మార్గదర్శక మండల్ చైర్మన్ యోగేష్ కుమార్ సింగి, అధ్యక్షుడు ఉమేష్ బాజీరెచ్ఛ తదితరులు పాల్గొన్నారు.