ఏప్రిల్ 1 షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

ఏప్రిల్ 1 షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర మరోసారి భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.195.50 పెరిగింది. కోల్‌కతాలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.218 పెరిగింది. ఈ పెరిగిన ధరలు నేటి (ఏప్రిల్ 1, 2026) నుంచే అమల్లోకి రానున్నాయి. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులకు ధరలు పెరగడంతో.. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లయింది.

ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రకారం.. రేట్లు పెరిగాక ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది. కమర్షియల్ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లకు ఈ పెంపు తలకు మించిన భారంగా మారింది. పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. 

మార్చి 1నే మన దేశంలో కమర్షియల్ సిలిండర్ల ధరను 115 రూపాయలు పెంచారు. ఒక నెల వ్యవధిలోనే ఏప్రిల్ 1న మళ్లీ 200 రూపాయలు పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు దిక్కు తోచని పరిస్థితి. యుద్ధం మొదలయ్యాక కమర్షియల్ సిలిండర్ల ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇండస్ట్రీయల్, ఆటోమొబైల్ రంగాలకు సరఫరా ఆగిపోయింది. దీని ప్రభావం రాష్ట్రంలోని 2 లక్షల కమర్షియల్ కనెక్షన్లతో పాటు ప్రైవేట్ కంపెనీల సరఫరాపై కూడా పడింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు 8 లక్షల సిలిండర్ల సరఫరా అవుతుండగా..ఈ సప్లయ్ని కేంద్ర నిర్ణయం ఇప్పటికే భారీగా దెబ్బ తీసింది. ఒక్క హైదరాబాద్​లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి.

టీ స్టాల్‌‌‌‌‌‌‌‌లు నుంచి స్టార్​ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి  రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కమర్షియల్​ సిలిండర్ల సప్లై బంద్​ కావడంతో డొమెస్టిక్ గ్యాస్​ సిలిండర్లకు డిమాండ్​ పెరిగింది. పలు హోటళ్లు డొమెస్టిక్​ సిలిండర్లు బ్లాక్లో తెప్పించుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల బదులు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దని అధికారులు హెచ్చరిస్తు్న్నా కొందరు హోటల్ ఓనర్లు డోర్​ డెలివరీ బాయ్స్తో మాట్లాడుకుని డొమెస్టిక్​ సిలిండర్లను బ్లాక్​లో కొనుగోలు చేస్తుండటం గమనార్హం.