ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

గుట్టపై ‘కార్తీక’ సందడి

యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. కార్తీక పూజలు జరిపించుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. భక్తుల రాకతో కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు కిక్కిరిశాయి. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కార్తీక పూజలు, దీపారాధనతో వ్రత మండపాలు, శివాలయం కొత్త కళను సంతరించుకున్నాయి. వీకెండ్​కావడంతో ఫ్యామిలీస్​తో కలిసి కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్రత టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. శనివారం ఒక్కరోజే 1,141 మంది దంపతులు వ్రత పూజలు నిర్వహించుకున్నారు. ఎక్కువ మంది భక్తులు రావడం, అందుకు సరిపడా సదుపాయాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో చంటిపిల్లలతో వచ్చిన భక్తులు అవస్థలు పడ్డారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శనివారం ఆలయానికి రూ.47,16,757 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.14,45,550, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.5.50 లక్షల ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.

డాక్టర్ లేకుండానే గర్భిణికి అబార్షన్ 
హాస్పిటల్ సీజ్


సూర్యాపేట వెలుగు: మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టగా రెండో కాన్పులోనూ ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకునేందుకు గర్భిణి సిద్ధం కాగా.. ఆమెకు ఇంటర్ ఫెయిల్ అయిన యువతి ఆయాతో కలిసి అబార్షన్ చేసింది. విషయం తెలుసుకున్న డీఎంహెచ్​వో .. అబార్షన్​ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకొని హాస్పిటల్​ను సీజ్​చేశారు. వివరాలిలా ఉన్నాయి...  మద్దిరాల మండలానికి చెందిన మహిళకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఏడాది తర్వాత రెండోసారి గర్భం దాల్చడంతో జిల్లా కేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్ లో చూయించుకోగా ఆడపిల్ల అని తేలింది. దీంతో శ్రీ నిధి హాస్పిటల్ లో పనిచేస్తున్న నరేశ్ అనే వ్యక్తిని గర్భిణి భర్త కలిసి అబార్షన్ చేయాలని అడిగాడు. శుక్రవారం అర్ధరాత్రి డాక్టర్ లేని సమయంలో స్వప్న అనే నర్స్ ఆయా పిచ్చమ్మ తో కలిసి గర్భిణికి టాబ్లెట్లు ఇచ్చింది. ఈ విషయం బయటకు రావడంతో డీ‌‌ఎం‌‌హెచ్‌‌ఓ డాక్టర్ కోట చలం  హాస్పిటల్ ను తనిఖీ చేశారు. అప్పటికే అబార్షన్​కాగా ఆగ్రహించిన ఆయన హాస్పిటల్​ను సీజ్​చేసి స్వప్న, ఆయా పిచ్చమ్మ, నరేశ్​పై పోలీసులకు ఫిర్యాదుచేశారు. 

కాల్వలో దూకిన మహిళ.. కాపాడిన ఆర్టీసీ డ్రైవర్​

హాలియా, వెలుగు: సాగర్​ కెనాల్ లో దూకిన మహిళను ఓ ఆర్టీసీ డ్రైవర్​ కాపాడారు. వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంటకు చెందిన పొదిల్ల చంద్రకళ తన కొడుకులు సరిగా చూసుకోవడం లేదని మనస్తాపంతో శనివారం హాలియా వద్ద సాగర్​కెనాల్​లో దూకింది. ఆ టైంలో అటుగా వెళ్తున్న హాలియాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్​ పి.వెంకటేశ్వర్లు పోలీసులకు సమారమిచ్చి వెంటనే కాల్వలోకి దూకి కొట్టుకుపోతున్న చంద్రకళను పట్టుకున్నాడు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ క్రాంతి ఇద్దరినీ తాడు సాయంతో బయటకు తీసుకొచ్చారు. సకాలంలో పోలీసులకు సమాచారం ఇచ్చి మహిళను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్​ను ఎస్ఐ శాలువాతో సత్కరించి అభినందించారు.

ఉత్సాహంగా మెడికోల ‘అద్వితీయ్’
పాల్గొన్న విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు: వైద్య రంగంలో తెలంగాణ దేశంలోనే  ఫస్ట్​ ప్లేస్​లో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్​రెడ్డి అన్నారు. నల్లగొండ మెడికల్​ కాలేజీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక లక్ష్మీ గార్డెన్స్​లో శనివారం నిర్వహించిన అద్వితీయ్​ 2022 ఉత్సవాలకు ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలేజీ రోజులను జీవితంలో మరుపురాని జ్ఞాపకాలుగా మలుచుకోవాలన్నారు. గొప్పదైన వైద్య వృత్తిలోకి వెళుతున్నారని, దానిని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మెడికోలకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్​ కాలేజీ ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్​నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు కాలేజీలు మంజూరు చేశారన్నారు.   కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ  ఎమెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​, ప్రిన్సిపల్ సీహెచ్ఎన్​ రాజకుమారి,  మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,  సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు,  వైస్ ప్రిన్సిపాల్ నిత్యానంద్ పాల్గొన్నారు. మెడికోల కల్చరల్​ ప్రోగ్రామ్స్​ అలరించాయి. 

జోడో యాత్రతో కాంగ్రెస్ జీరో అయింది

యాదగిరిగుట్ట, వెలుగు: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో అయిందని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేస్తున్న టైంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనమన్నారు. ఆలేరు మండలం కొలనుపాక కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అమృతం బాలరాజు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం యాదగిరిగుట్టలో మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఆలేరు సహా రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, వచ్చే ఎన్నికల్లో మూడోసారి టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. చేరినవారిలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు పుప్పాల మహేశ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూసరి గణేశ్, ఉన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, వైస్ ఎంపీపీ వెంకటేశ్​యాదవ్ పాల్గొన్నారు.

కేంద్ర​ సర్కారు తీరును ఎండగట్టండి

యాదాద్రి, వెలుగు: తెలంగాణ రాష్ట్రం, ప్రజల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని టీఆర్ఎస్​ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. భువనగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం న్యాయంగా, చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా పెత్తనం చేయాలని చూస్తోందన్నారు. విద్య, వైద్య రంగాల్లో సవతి ప్రేమ చూపుతోందని, ఈ వివక్షను ప్రజలకు వివరించాలన్నారు. మీటింగ్​లో టీఆర్ఎస్​ లీడర్లు జనగాం పాండు, ఏవీ కిరణ్ కుమార్, రచ్చ  శ్రీనివాస్​రెడ్డి, సీత, రమేశ్, శ్రీధర్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

రాజీకి అర్హమైన కేసులను పరిష్కరించుకోవాలి 

నల్గొండ అర్బన్, హుజూర్​నగర్, వెలుగు: రాజీకి అర్హమైన కేసులను పరిష్కరించుకుని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని నల్గొండ జిల్లా ప్రధాన జడ్జి జగ్జీవన్​కుమార్​ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో 4వ జాతీయ లోక్​ అదాలత్​ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్​లో మొత్తం 4112 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. వాటిలో 45 సివిల్​, 3958 క్రిమినల్, 5 జిల్లా వినియోగదారుల, 47 ప్రిలిటిగేషన్​, 62 మోటారు వాహన ప్రమాద బీమా కేసులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్​ సివిల్​ జడ్జి దీప్తి, మొదటి అదనపు జిల్లా జడ్జి జయరాజు, 2వ అదనపు జిల్లా జడ్జి తిరుపతి, సీనియర్​ సివిల్​ జడ్జి తేజో కార్తీక్​, మెజిస్ట్రట్స్​కీర్తి చంద్రికారెడ్డి, శ్రీవాణి పాల్గొన్నారు. హుజూర్​నగర్​కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్​కుమార్ ఆధ్వర్యంలో లోక్​అదాలత్​నిర్వహించారు. 11 కేసులు పరిష్కారమయ్యాయని జడ్జి తెలిపారు. 

ప్రధాని పర్యటనపై లెఫ్ట్​ పార్టీల నిరసన 


నెట్​వర్క్, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదని లెఫ్ట్​ పార్టీల నేతలు విమర్శించారు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా విభజన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. హాలియాలో టీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి  మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. హుజూర్ నగర్ సీపీఐ ఆఫీసు ఎదుట ఆ పార్టీ నాయకులు నల్ల జెండాలతోనిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి  జెండాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చండూరులో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మోడీ గో బ్యాక్​అంటూ నినాదాలు చేశారు.  తుంగతుర్తి, మఠంపల్లి, మేళ్లచెరువులోనూ నిరసన జరిగాయి. 

మిర్యాలగూడలో అరెస్ట్​ 


మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడలో టీఆర్ఎస్వీ రాష్ర్ట కార్యదర్శి ఎండీ షోయబ్​, ఎస్​ఎఫ్​ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా, టీఆర్ఎస్​ జిల్లా నేత యర్రమాళ్ల దినేశ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. 

20 ఏండ్ల క్రితం బిల్లు కట్టలేదని..కరెంట్​ కట్​

కోదాడ,వెలుగు: 20 ఏండ్ల క్రితం కరెంట్​బిల్లు చెల్లించాలని కనెక్షన్​కట్​చేశారు కరెంట్​ సిబ్బంది. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రస్తుతం ఉన్న  డేగ బాబు ఫంక్షన్ హాల్ ప్రాంతంలో గతంలో మాదాల ఆయిల్ మిల్ ఉండేది. దీనికి నష్టాలు రావడంతో 20 ఏండ్ల కింద మూసేశారు. ఆ టైంలో ఆ మిల్లుకు కరెంట్​ బిల్లు పెండింగ్​లో ఉంది. తర్వాత ఆ మిల్లు స్థలాన్ని వేలంలో కొని ప్లాట్లుగా చేసి అమ్మగా 30 కుటుంబాలవారు కొన్నారు. ప్రస్తుతం అప్పటి పెండింగ్​ బిల్లు రూ.1.50లక్షలు కట్టాలని కరెంట్​సిబ్బంది కనెక్షన్లు కట్​చేశారు. దీంతో వారు రెండు రోజులపాటు ఇబ్బంది పడ్డారు. బాధితులు కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త జలగం సుధీర్, కుదరవల్లి బసవయ్య, పొడుగు హుసేన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు శనివారం కరెంట్​అధికారులతో మాట్లాడటంతో కనెక్షన్​ పునరుద్ధరించారు.


మంత్రి జగదీశ్ రెడ్డి  రాజీనామా చేసి గెలవాలి 
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని 

సూర్యాపేట వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా  12 సీట్లలో గెలుస్తామని చెప్తున్నా మంత్రి జగదీశ్​రెడ్డి తన పదవికి రాజీనామా చేసి గెలవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. శనివారం రామగుండంలో జరిగిన ప్రధాని మోడీ బహిరంగ సభను జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్‌‌ హాల్లో ఎల్‌‌ఈడీ స్క్రీన్‌‌ ద్వారా పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి వీక్షించారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌‌.. వామపక్షాలను అడ్డుపెట్టుకొని ప్రధాని పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని,  ప్రధాని స్థానానికి గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు.  కార్యక్రమంలో లీడర్లు చల్లమల్ల నరసింహ, కార్తీక్‌‌రెడ్డి, ఎండీ అబిద్, ఉపేందర్, సుశీందర్ రెడ్డి, సైదులు,  దాసరి వెంకన్న యాదవ్‌‌  
తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కోదండరామస్వామి  కల్యాణం 

మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా  మునగాల మండలం  నరసింహపురంలోని పురాతన దేవాలయం కోదండ రామస్వామి తిరు కల్యాణం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. స్వామివారిని గ్రామంలో ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చి వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు మునగాల, చిలుకూరు, నడిగూడెంతోపాటు ఇతర జిల్లాల నుంచి తరలివచ్చారు. శనివారం ఉదయం గోదాదేవి కళ్యాణ మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో సర్పంచ్ కారంగుల నాగమణి, దేవాలయ కమిటీ చైర్మన్  బొమ్మ అంజయ్య పాల్గొన్నారు. 

కబడ్డీ విజేతలకు బహుమతులు 

శ్రీ కోదండరామ స్వామి తిరు కల్యాణం సందర్భంగా నిర్వహించిన కబడ్డీ, డాన్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కళాకారులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కబడ్డీ పోటీలలో  గుంటూరు ఫస్ట్, కల్లూరు సెకండ్, నూతన్ కల్ థర్డ్​ప్రైస్​గెలుచుకున్నాయి. డ్యాన్స్​జిల్లాస్థాయి లో పోటీల్లో నరసాపురం ఫస్ట్, స్థానిక శ్రీరామ యూత్ సెకండ్ , కట్టకొమ్ముగూడెం థర్డ్​బహుమతి గెలుచుకున్నారు. కార్యక్రమంలో దాతలు పిల్లుట్ల శ్రీనివాస్, దేవినేని త్రిలోక్ చౌదరి, కాటం రెడ్డి ప్రసాద్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.  


అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరికలు
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

నేరేడుచర్ల, వెలుగు: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఇంజమరి మల్లయ్య శనివారం టీఆర్ఎస్ లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను గడప, గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేరేడుచర్ల పట్టణ, మండలాధ్యక్షుడు చల్లా శ్రీలతా రెడ్డి, సురేశ్​​బాబు, పాలకవీడు మండలాధ్యక్షుడు కిష్టపాటి  అంజిరెడ్డి, లైబ్రరీ చైర్మన్ మార్కండేయ పాల్గొన్నారు.


అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ విమర్శలు

సూర్యాపేట వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట పట్టణంతోపాటు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, దానిని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మున్సిపల్ చైర్​పర్సన్​పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్ అన్నారు.శనివారం మంత్రి క్యాంపు ఆఫీసులో వారు మాట్లాడుతూ సూర్యాపేటలో మెయిన్​రోడ్డు సుందరీకరణ పనులు సాగకుండా కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నది కాంగ్రెస్​లీడర్లు కాదా అని ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని.. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ లీడర్​ బాలసైదులుగౌడ్, మున్సిపల్​ కౌన్సిలర్లు పాల్గొన్నారు.