ఓల్డ్‌సిటీ, వెలుగు: కార్వాన్ పరిధిలోని కుమ్మరవాడి వద్ద విద్యుత్ స్తంభంపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయిన రాజు నాయక్ (44) అనే కాంట్రాక్ట్ కార్మికుడిని టప్పాచబుత్రా కానిస్టేబుల్ బి. సురేశ్ కాపాడారు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరగగా, బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ సురేశ్ గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్ చేశారు. దీంతో రాజు నాయక్ ఊపిరి పీల్చుకోగా, వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆపత్కాలంలో అసాధారణ సమయస్ఫూర్తిని ప్రదర్శించిన కానిస్టేబుల్ సురేశ్నుఉన్నతాధికారులు అభినందించారు.
