బెట్టింగులకు బానిసైన కానిస్టేబుల్.. లోన్ డబ్బులు తీసుకొని ఇంటి నుంచి అదృశ్యం..

బెట్టింగులకు బానిసైన కానిస్టేబుల్.. లోన్ డబ్బులు తీసుకొని ఇంటి నుంచి అదృశ్యం..

బెట్టింగ్ భూతానికి బలవుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పోలీసులు, ప్రభుత్వం బెట్టింగ్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ జనాల్లో మార్పు రావడం లేదు. హైదరాబాద్ లో బెట్టింగులకు బానిసైన ఓ కానిస్టేబుల్ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ రహ్మత్ నగర్ కి చెందిన రమేష్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బెట్టింగులకు బానిసైన రమేష్ అప్పులు చేశాడు. 

ఈ క్రమంలో లోన్ డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు రమేష్. రోజులు గడుస్తున్నా రమేష్ ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అతని భార్య. రమేష్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెదక్‌‌‌‌ జిల్లాలోని చాలా గ్రామాల్లో జనం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ బారిన పడుతున్నారు. నిజాంపేట మండలంలోని ఒక్క చల్మెడ గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పేకాట, బెట్టింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.

మొదట్లో వందలు పెడ్తే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు.. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్పు చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 

చల్మెడ గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.