గ్రేటర్​ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు పెరిగినయ్

గ్రేటర్​ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు పెరిగినయ్
  • గ్రేటర్​ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు పెరిగినయ్
  • గతంతో పోలిస్తే 2021–22లో భారీగా పెరిగిన సంఖ్య  
  • కరోనా ఎఫెక్ట్​ తగ్గడంతోనే అంటున్న రియల్టర్లు

హైదరాబాద్, వెలుగు: గడిచిన ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు భారీగా పెరిగాయి. 2020–-21లో జీహెచ్ఎంసీ 11,538 నిర్మాణాలకు పర్మిషన్​ఇవ్వగా, 2021– 22లో 17,572 నిర్మాణాలకు ఇచ్చింది. అందులోనూ17,334 ఇండ్ల నిర్మాణాలే ఉన్నాయి. ఇవి కాకుండా 83 హైరైజ్ బిల్డింగ్​లకూ పర్మిషన్ ఇచ్చింది. ఇందులో 30 ఫ్లోర్స్​కి సంబంధించి 13 ఉన్నాయి. వీటితోపాటు రెండు మల్టీఫ్లెక్స్ లకు అనుమతులు జారీ చేసింది. కరోనా ఎంటర్​అయ్యాక నిర్మాణ రంగం పూర్తిగా డౌన్ కాగా కొవిడ్​కేసులు తగ్గుముఖం పట్టడంతో కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. గతేడాది జారీ చేసిన అనుమతుల్లో గడిచిన ఆరు నెలల్లో ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా జీహెచ్ఎంసీకి భారీగానే ఆదాయం వచ్చింది. 2020–21లో రూ.661కోట్లు రాగా, 2021–22కి సంబంధించి రూ.1,144 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇండివిడ్యువల్ ఇండ్లకే మొగ్గు
కరోనా తరువాత జనం ఇండివిడ్యువల్ ఇండ్లలో ఉండేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల్లోనూ అవే ఎక్కువగా ఉన్నాయి. 100 నుంచి 200 చదరపు గజాల వరకు ఇండివిడ్యువల్​గానే నిర్మించుకుంటున్నారు. కరోనా ఎంటర్​అయ్యాక సిటీలో అద్దెకు ఉంటున్నవారు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో 2020–21లో పెద్దగా నిర్మాణాలు జరగలేదు. ఎక్కడ చూసినా ఉన్న ఇండ్లకే టూలెట్ బోర్డులు కనిపించాయి. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా నార్మల్​అవ్వడంతో ఉద్యోగులు తిరిగి సిటీకి వచ్చారు. ఐటీ ఉద్యోగులు కూడా వచ్చేస్తున్నారు. దీంతో అద్దె ఇండ్లకు డిమాండ్​పెరుగుతుందని రియల్​ఎస్టేట్​వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణాలు పెరిగాయని అంటున్నారు. 

జోరుగా ‘రియల్’​ వ్యాపారం
సిటీలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. జనం ఇండ్లు కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుండడంతో నిర్మాణాలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. బిల్డర్లు ల్యాండ్ కొని ఇండ్లు నిర్మించి విక్రయిస్తున్నారు. రేట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముందు ముందు రేట్లు మరింత పెరగొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. సిమెంట్, ఇసుక, స్టీల్, లేబర్ ఖర్చు పెరగడమే అందుకు కారణం అంటున్నారు.