- కార్యాచరణ రెడీ చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్ ,వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల క్యూర్ ( కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్దం చేయాలని అధికారులను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని.. దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్ లో మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ లతో కలిసి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇండ్ల రివ్యూ చేపట్టారు.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు, అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్లకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పనిసరిగా కల్పించాలన్నారు. ముఖ్యంగా 22వేల ఇండ్లకు విద్యుత్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమర్షియల్ షాపులను వేలం పద్ధతిలో విక్రయించాలన్నారు. ఆ డబ్బును సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్ పేరిట వేయాలన్నారు.
ఇంట్లో ఉండకపోతే రద్దు చేస్తం
డబుల్ బెడ్ రూం ఇండ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్నవారికి, ఏండ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్నవారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. నోటీసులకు స్పందించని వారి ఇండ్లు రద్ధు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని ఆదేశించారు.
