హైదరాబాద్ సిటీ, వెలుగు: 90 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పారిశుధ్యం, ఈ-–వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) సేకరణ, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు పనులను ఉన్నతాధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గచ్చిబౌలిలోని ఐకియా– మీనాక్షి డిలైట్ రోడ్డులో గుట్టలుగా పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాల తొలగింపు పనులను సీఎంసీ కమిషనర్ జి. సృజన, రంగారెడ్డి కలెక్టర్ కలిసి పరిశీలించారు. వీటిని త్వరగా తొలగించి రాంకీ ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించాలని ఆదేశించారు.
అనంతరం ఆ ప్రదేశాన్ని ప్రజాప్రయోజనాలకు వినియోగించాలని అధికారులకు సూచించారు. అలాగే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఈ- వేస్ట్ సేకరణను పరిశీలించి, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కేవలం అధికారిక కేంద్రాల్లోనే అప్పగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. టెలిఫోన్ కాలనీ, ఆర్కే పురం తదితర ప్రాంతాల్లో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. మురుగు కాల్వల్లో పూడికతీత, స్వచ్ఛ ఆటోల పనితీరును సమీక్షించారు. చిత్రా లేఅవుట్ వాసుల ఫిర్యాదు మేరకు పందుల సమస్యను పరిష్కరించాలని, పార్కుల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు.
