- దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్
పద్మారావునగర్, వెలుగు : రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్‌లో కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలని డిమాండ్‌చేస్తూ నేటి నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. సోమవారం పికెట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దీక్షకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డుకు కొన్నేండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోరాటం చేస్తామని హెచ్చరించారు.
