కదం తొక్కిన కాంట్రాక్ట్ కోచ్‌లు

V6 Velugu Posted on Apr 07, 2021

  • రెగ్యులరైజ్ చేయాలంటూ ఎల్బీ స్టేడియంలో  భారీ ధర్నా

హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) కాంట్రాక్ట్  కోచ్ లు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న తమ సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎల్బీ స్టేడియంలో ధర్నా చేశారు. వారికి ఔట్ సోర్సింగ్, ఇతర కోచ్లు మద్దతు తెలిపారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో పని చేస్తున్న దాదాపు వంద మంది కోచ్లు ధర్నాలో పాల్గొన్నారు.  తమ సమస్యను పట్టించుకోని చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎండలో చాలాసేపు కూర్చోవడంతో  కాంట్రాక్ట్ కోచ్ల సంఘం ప్రెసిడెంట్ సత్యవాణి సొమ్మసిల్లి పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆమెను వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి .. ముగ్గురు కోచ్లు, శాట్స్ అధికారులను శాట్స్ ఇంచార్జ్ వీసీ, ఎండీ, క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు దగ్గరికి తీసుకెళ్లారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కోచ్లు తమ సమస్యలను, 28 ఏళ్లుగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని  ఆయనకు వివరించారు. 2008లో ఉమ్మడి ఏపీ హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. అయినా తమకు వర్తించని జీఓలు, సెక్షన్లను తెరపైకి తెచ్చి తమ ఫైల్కు మోక్షం కలగకుండా అప్పటి శాప్, ప్రస్తుత శాట్స్ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. సర్వీస్ రూల్స్, ఇంక్రిమెంట్స్, ఇతర బెనిఫిట్స్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  కోచ్ల డిమాండ్లో న్యాయం ఉందన్న శ్రీనివాసరాజు వాళ్ల రెగ్యులరైజేషన్ ఫైల్ను పక్కాగా తయారు చేయాలని శాట్స్ అధికారులను ఆదేశించారు. దాన్ని సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి ఆమోదముద్ర వేయించే బాధ్యత శాట్స్ చైర్మన్కే అప్పగించారని కోచ్ల సంఘం ప్రతినిధులు చెప్పారు. తమ సమస్యలకు ఈనెల15 లోపు పరిష్కారం చూపకపోతే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. అలాగే, తొందర్లో ప్రముఖ కోచ్లు, స్పోర్ట్స్ అసోసియేషన్లు, స్పోర్ట్స్ పర్సన్లతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
 

Tagged Hyderabad, posts, jobs, Dharna, regularization, LB STADIUM

More News