- వీరిలో సంతోష్‌రావు పేరు.. త్వరలోనే అరెస్ట్‌లు ఉంటాయంటున్న అధికారులు
- పక్కా ఆధారాలు, టెక్నికల్ఎవిడెన్స్తో ఫైనల్ చార్జ్‌షీట్!
- కేసుకు బలం చేకూర్చేలా 2 వేలకు పైగా సాంకేతిక ఆధారాలు
- దాదాపు 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు
- కీలకంగా మారిన 618 మంది ఫోన్ నంబర్లు
- అక్రమార్కులు తప్పించుకోకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకు
- బుధవారం న్యాయనిపుణులతో సిట్ అధికారుల భేటీ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడిన బీఆర్ఎస్ పెద్దల తరఫున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వీరిలో కేసీఆర్ సన్నిహితుడైన సంతోష్‌రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.
ఈ మేరకు సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 2 వేలకు పైగా టెక్నికల్ఎవిడెన్స్ సేకరించిన సిట్..ట్యాపింగ్ లిస్టులోని 618 ఫోన్ నంబర్లలో దాదాపు 300 మందికి పైగా స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. ఇందులో ట్యాపింగ్ లిస్ట్‌కు అప్రూవల్ ఇచ్చిన మాజీ సీఎస్‌లు, రివ్యూ కమిటీలోని ఐఏఎస్, ఐపీఎస్‌లు, ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు గురైన వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర ప్రముఖుల స్టేట్‌మెంట్లు ఉన్నాయి. ఇవే కాకుండా ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన ఆడియో రికార్డింగులు, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ సహా ఇతర ఎవిడెన్స్, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మొదట్లో కొంతమంది పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సిట్, కొంతకాలంగా విచారణకే పరిమితమైంది. కాగా, త్వరలో ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే అదనపు ఛార్జ్‌షీట్ దాఖలుకు ఏర్పాట్లు చేస్తోంది.
అన్ని ఆధారాలతో సిద్ధమైన సిట్..
ఎస్‌ఐబీ కేంద్రంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్‌కు నిధుల కేటాయింపునకు సంబంధించి సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. 2019 సెప్టెంబర్ 8 నుంచి 2023 వరకు హరీశ్‌రావు ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నారు. అదే టైంలో ఎస్‌వోటీ విభాగంలో ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన పరికరాలు కొన్నారు. దీనికి సంబంధించిన పలు వివరాలను హరీశ్‌రావు విచారణ సందర్భంగా సిట్తెలుసుకుంది. దీంతో పాటు ఎన్నికల టైంలో సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రత్యర్ధుల ఫోన్లు ట్యాపింగ్చేయడం, నగదు పట్టివేతకు సంబంధించి వివరాలతో పాటు బాధితుల వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్‌ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఇందుకు సంబంధించి రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ లిస్టులో పెట్టినట్లు తేల్చింది. ఆయా ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితుల వాంగ్మూలాలు రికార్డ్ చేసింది. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ పెద్దల తరుపున మధ్యవర్తిత్వం వహించిన సంతోష్‌రావుతోపాటు పలువురు ప్రైవేట్‌వ్యక్తులు వ్యాపారుల నుంచి వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.
వీరిని అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో పాటు సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల వారిగా మరికొంత మందిపై అభియోగాలు మోపుతూ సిట్ తన ఛార్జ్‌షీట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ముగ్గురి స్టేట్మెంట్ల పరిశీలన..
గత ప్రభుత్వ హయాంలో హోంశాఖకు మంత్రి ఉన్నా లా అండ్ఆర్డర్మాత్రం సీఎం కేసీఆర్ ఆధీనంలోనే ఉండేది. నాడు ఇంటెలిజెన్స్ఐజీగా పని చేసిన ప్రభాకర్‌రావు పదవీ విరమణ చేసినప్పటికీ తెచ్చి ఎస్ఐబీ చీఫ్ గా నియమించారు. అలాగే సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావుకు మరో రెండేండ్లు పొడిగింపు ఇచ్చారు. ఇలా ఎందుకు చేశారో కేసీఆర్ ను ఇటీవల సిట్అడిగి తెలుసుకుంది. ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను సేకరించింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్‌రావు కూడా కస్టడీలో ఇచ్చిన స్టేట్‌మెంట్లను, కేసీఆర్ స్టేట్‌మెంట్‌లోని అంశాలను సిట్ పరిశీలించినప్పుడు ప్రభాకర్ రావు నియామకం వెనుక కుట్రకోణం ఉందనే నిర్ధారణకు సిట్అధికారులు వచ్చారు. ఈ క్రమంలోనే మరోవైపు ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం దగ్గరి నుంచి 2023 డిసెంబర్ 4న బేగంపేటలోని ఎస్‌ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం వరకు సిట్ బృందం పూర్తి టెక్నికల్ఎవిడెన్స్సేకరించారు. ఈ కేసులో రెండో నిందితుడైన ప్రణీత్‌రావు చీఫ్‌గా స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్(ఎస్‌వోటీ) టీమ్ 618 ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు ఆయా టెలికం సర్వీసెస్‌నుంచి అధికారిక రికార్డులను కూడా సేకరించిన సంగతి తెలిసిందే.
అరెస్ట్‌లకు నిర్ణయం..
“ కేసీఆర్ విచారణ తర్వాత బుధవారం సిట్ మరోసారి కీలక భేటీ నిర్వహించింది. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో అధికారులు న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. కేసులో నిందితులు, బాధితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్లతో పాటు హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావు, కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి, చివరగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్లను పరిశీలించారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై న్యాయసలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫోన్‌ట్యాపింగ్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న మరికొంత మందిని అరెస్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
