ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శనివారం ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లు మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ పరశురామ్, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ కుమార్ మాట్లాడుతూ.. చాలా ఏండ్లుగా రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నామన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీసును రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం వర్సిటీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లను పక్కన పెట్టిందన్నారు. జీవో 16 కింద వర్సిటీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లను సైతం రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్టీచర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఉపేందర్, డాక్టర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
