- స్కీమ్స్ ఫెయిల్ అయితే కాంట్రాక్టర్లపైనా చర్యలుండాలి
- అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ వేయాలి
- సభకు రాని వ్యక్తే అజెండా డిసైడ్ చేస్తున్నరని కేసీఆర్‌పై ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారు తున్నాయి తప్ప.. కాంట్రాక్టర్లు మాత్రం మారడం లేదని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం వచ్చినా పాత కాంట్రాక్టర్లే దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు.
శనివారం అసెంబ్లీలో ఇరిగేషన్‌పై జరిగిన చర్చలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మొదలుకొని.. స్కూళ్లకు రంగులు వేయడం, బెంచీల సరఫరా వరకు గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు విఫలమైతే కేవలం అధికారులనే కాదు.. కాంట్రాక్టర్లను కూడా బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చేసిన పనులపై సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నరు..
ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడంపై అక్బరుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. ‘‘సభకు రాని వ్యక్తి అసెంబ్లీ అజెండాను డిసైడ్ చేస్తున్నరు. ఇరిగేషన్‌పై చర్చిస్తామని చెప్పి.. తీరా చర్చ మొదలయ్యాక ఆయన గానీ, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గానీ సభలో లేకపోవడం విడ్డూరం’’ అని ఎద్దేవా చేశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. ఎండాకాలంలో హైద రాబాద్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడ చేపట్టాలనే దానిపై తాను అప్పుడే అభ్యంతరం చెప్పానని గుర్తు చేశారు.
