- సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్ నియామకం
- ప్రొఫెసర్లు ఉన్నా అసోసియేట్‌కు ఇవ్వడంపై విమర్శలు
- ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీకి దక్కని ప్రాతినిధ్యం
కరీంనగర్, వెలుగు : శాతవాహన యూనివర్సిటీ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కొందరు అర్హత లేని వారిని నియమించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అర్హత ఉన్నవారిని ఉద్దేశపూర్వకంగానే పక్కన బెట్టారన్న చర్చ జరగుతోంది. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో ఉర్దూ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ జాఫర్ జరీకి చోటు కల్పించడం వివాదాస్పదంగా మారింది.
వాస్తవానికి యూనివర్సిటీ పరిధిలో ప్రొఫెసర్ హోదాలో ప్రస్తుతం ఎకనామిక్స్ ప్రొఫెసర్ వరప్రసాద్, సోషియాలజీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఉన్నప్పటికీ.. వారిని కాదని అసోసియేట్ ప్రొఫెసర్ పేరును పంపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను ఇప్పటికే సోషల్ సైన్సెస్ డీన్, ప్రిన్సిపాల్ వంటి పదవుల నుంచి తొలగించడంపై దుమారం రేగుతుండగా.. తాజాగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోనూ స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. శాతవాహన యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ మహ్మద్ జాఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ అనే ఉంది. మహ్మద్ జాఫర్ సీనియర్ ప్రొఫెసర్ కేటగిరీ కానప్పటికీ.. ఆయనను సీనియర్ ప్రొఫెసర్‌గా చూపిస్తూ ఉన్నత విద్యా శాఖకు వైస్ ఛాన్స్‌లరే ప్రతిపాదనలు పంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీకి దక్కని ప్రాతినిధ్యం
ఉత్తర తెలంగాణలోనే పేరెన్నికగన్న ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోనే పెద్ద కాలేజీగా పేరుంది. ఈ కాలేజీ ప్రస్తుతం హాస్టల్ సదుపాయంతో అటామనస్ హోదా కలిగి ఉంది. ఈ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లనుగానీ, ప్రిన్సిపాల్‌ను గానీ ప్రతీసారి ఈసీలోకి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఈ కాలేజీ ప్రొఫెసర్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కాలేజీల నుంచి సైతం ఈసీలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎమినెంట్ పర్సన్స్ కేటగిరీలో.. డిగ్రీ కాలేజీ మూసేసిన మాజీ కరస్పాండెంట్‌ను నియమించడం వివాదాస్పదంగా మారింది.

