- జనవరి దాకా అబ్సార్ప్షన్ వాయిదాకు డిమాండ్
- నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్తామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో లేటరల్ ఎంట్రీ అబ్సార్ప్షన్ వ్యవహారం వివాదంగా మారింది. డీఎంఈ పరిధిలోని టీచింగ్ హాస్పిటళ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించేందుకు డీపీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పనిచేస్తున్న పీజీ వైద్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఈ నెల 14న డీఎంఈ సర్క్యులర్ జారీ చేసింది. అయితే, సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారిని ఈ ప్రక్రియలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు డాక్టర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ఏప్రిల్లో చేపట్టిన ప్రక్రియలోనూ అవకతవకలు జరిగాయని, ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని చెబుతున్నాయి.
36 నెలల పీజీతోపాటు... ఏడాది సీనియర్ రెసిడెన్సీ తప్పనిసరి
ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం పీజీ కోర్సు 36 నెలలు పూర్తి కావాలి. జీవో 56 ప్రకారం పీజీ తర్వాత ఏడాది సీనియర్ రెసిడెన్సీ కూడా తప్పనిసరి. అయితే, యూనివర్సిటీ ఫలితాల తేదీని ప్రామాణికంగా తీసుకుని అక్టోబర్ నాటికే సీనియర్ రెసిడెన్సీ పూర్తయినట్లు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీవో 154 ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో ప్రతి ఐదు పోస్టుల సైకిల్లో మూడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, ఒకటి అర్హులైన సీఏఎస్, ఆర్ఎంవోలకు, మరో పోస్టు డీపీహెచ్, టీవీవీపీ విభాగాల్లోని అర్హులైన ఇన్-సర్వీస్ వైద్యులకు కేటాయించాలి.
జనవరిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే మరో 200 మందికి చాన్స్..
ప్రస్తుతం అక్టోబర్లోనే అబ్సార్ప్షన్ ప్రక్రియ పూర్తి చేస్తే కొద్దిమందికే అవకాశం దక్కుతుందని డాక్టర్ల సంఘాలు చెబుతున్నాయి. జనవరి వరకు వాయిదా వేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తే డిసెంబర్, జనవరి బ్యాచ్లకు చెందిన మరో 200 మందికి పైగా వైద్యులు అర్హత సాధిస్తారని పేర్కొంటున్నాయి. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు ప్రస్తుత సర్క్యులర్ను నిలిపివేసి, జనవరిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నాయి.
