మిడ్‌‌‌‌ డే మీల్స్ చార్జీలు పెంపు.. మే 1 నుంచే అమల్లోకి కొత్త రేట్లు.. ఉత్తర్వులు జారీ

మిడ్‌‌‌‌ డే మీల్స్ చార్జీలు పెంపు.. మే 1 నుంచే అమల్లోకి కొత్త రేట్లు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పీఎం పోషణ్ (మిడ్​ డే మీల్స్) స్కీమ్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ పెంచిన రేట్లు మే ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన జీవో నంబర్ 189ను  సోమవారం రిలీజ్ చేశారు. 

ప్రీ-ప్రైమరీతో పాటు ప్రైమరీ క్లాసులకు ఒక్కో విద్యార్థికి గుడ్డు ఖర్చు మినహాయించి గతంలో ఇస్తున్న రూ.6.19 పైసలను రూ.6.78కి పెంచారు. అప్పర్ ప్రైమరీ క్లాసులకు (6,7,8 తరగతులు) వంట ఖర్చును (గుడ్డు ఖర్చు మినహాయించి) రూ. 9.29 పైసల నుంచి రూ.10.17లకు పెంచారు.

తొమ్మిది, పదో తరగతి పిల్లలకు గుడ్డు ఖర్చు రూ.3 కలుపుకొని రోజువారీ వంట ఖర్చు రూ.11.79 నుంచి రూ.13.17లకు పెంచారు. ఎరియర్స్ ను స్కీమ్​ నుంచే ఇవ్వాలని ఆదేశించారు. కాగా,  సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థికి అయ్యే రోజువారీ ఖర్చు పెరగడంతో పాటు, మెనూలో నాణ్యత మెరుగుపడనుంది. ఈ స్కీమ్​లో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం చొప్పున నిధులు ఖర్చు చేస్తారు.

పీఎం పోషణ్ నిధులు రూ.44 కోట్లు విడుదల
మిడ్‌‌‌‌ డే మీల్స్ స్కీమ్​ కింద వంట ఖర్చుల బకాయిలు రిలీజ్ అయ్యాయి. వంట ఖర్చుతో పాటు సెంట్రల్ కిచెన్ హెల్పర్స్ గౌరవ వేతనం కోసం మొత్తం రూ.44.90 కోట్లు మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు,సెప్టెంబర్  రెండు నెలల బకాయిలు రిలీజ్ చేశారు. దీనిలో కుకింగ్ కాస్ట్ రూ.34.91 కోట్లు, గౌరవ వేతనం రూ.10 కోట్లు ఉన్నాయి.