కట్టెలకు  ఫుల్ డిమాండ్.. రూ. 2 వేలకు చేరిన క్వింటాల్..  ఇంతకుముందు రూ. వెయ్యే

 కట్టెలకు  ఫుల్ డిమాండ్.. రూ. 2 వేలకు చేరిన క్వింటాల్..  ఇంతకుముందు రూ. వెయ్యే
  • వేకువజాము నుంచే హోటల్స్, ఫంక్షన్​హాల్స్​, హాస్టల్​ నిర్వాహకుల క్యూ  
  • కట్టెల పొయ్యి అయితే రామంటున్న కుక్​లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయంగా నగరంలోని చాలా హోటళ్లు, ఫంక్షన్ హాల్స్​నిర్వాహకులు కట్టెలపై వంటలు చేస్తుండటతో వంట చెరుకుకు డిమాండ్ ఏర్పడింది. దీంతో టింబర్ డిపోల దగ్గర భారీగా బారులు తీరుతున్నారు. దీంతో కట్టెల మండి నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. గ్యాస్ కొరత ఏర్పడక ముందు వరకు క్వింటాలు కట్టెలు రూ. వెయ్యి నుంచి రూ. 1200 వరకు ఉంటే.. ఇప్పుడు క్వింటాల్​కు రూ. 2 వేల వరకు పలుకుతోంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధరల భారం తగ్గించుకుందామని కట్టెల పొయ్యి వైపు చూస్తుంటే అక్కడ కట్టెల మంట తప్పడం లేదు.

మరోవైపు ట్రాన్స్​పోర్టేషన్​ఖర్చులు భారం కావడంతో పాటు కట్టెల తరలింపుపై సిటీలో ఆంక్షలు ఉండటంతో డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగ్గ సరఫరా లేక రేట్లు మండుతున్నాయి. ధరలు ఒక ఎత్తయితే, వంటలు చేసే మనుషులు దొరక్కపోవడం హోటళ్లు, ఫంక్షన్స్ హాల్స్​, హాస్టల్స్​వారికి పెద్ద సమస్యగా మారింది. గ్యాస్ స్టవ్‌‌‌‌‌‌‌‌లు, బర్నర్లకు అలవాటు పడిన నేటి తరం వంటవాళ్లు కట్టెల పొయ్యిపై వండేందుకు ఆసక్తి చూపడంలేదు. 

పెండ్లిళ్లు, ఫంక్షన్లపై ఎఫెక్ట్..

పెండ్లిలు, ఫంక్షన్లు చేస్తున్న వారికి గ్యాస్ సమస్య పెద్ద సవాల్ గా మారింది. పెండ్లి సీజన్ కావడం, డబ్బులు ఎక్కువగా పెట్టినా గ్యాస్ దొరక్కపోవడంతో నిర్వాహకులతో పాటు పెండ్లిళ్లు చేసుకుంటున్న కుటుంబాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. పెండ్లిళ్లకు ముందుగానే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోగా మూడు రోజుల నుంచి గ్యాస్​సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కట్టెల పొయ్యిలపై వంట చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, వంటలు వండేవాళ్లు  కట్టెల పొయ్యిపై అయితే తాము వచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. ఊరికే కట్టెలు పెట్టడం, తీయడం చేయాలని, తమకు అలవాటు లేదని చెప్తున్నారు. అలాగే వండిన తర్వాత మసి పట్టిన గిన్నెలు తోమడానికి కూడా పనివాళ్లు రావడం లేదు. 

హోటల్స్​పై మరింత ఎఫెక్ట్..

ఇక హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్​కట్టెల పొయ్యిలపై వంట కంటిన్యూ చేస్తున్నారు. అయితే, మూడు, ఐదంతస్తులు ఇలా ఉండి కింది అంతస్థుల్లో హాస్టల్స్​, హోటల్స్​, రెస్టారెంట్లు రన్​చేస్తున్నవారికి కష్టాలు తప్పడం లేదు. కట్టెల పొయ్యిపై వంట చేస్తే పై అంతస్థుల్లో ఉన్నవారు పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఓపెన్​స్పేస్​ఉన్నవారు అక్కడ కట్టెలతో అక్కడ వండుకుంటున్నారు. ఈ ఛాన్స్​లేని వారు మూసేస్తున్నారు.

ఓయూను తాకిన సిలిండర్ల సెగ కట్టెల పొయ్యిపై వంటలు

ఓయూ, వెలుగు: ప్రతిష్టాత్మక ఓయూ హాస్టల్స్​కు సిలిండర్ల కొరత సెగ తాకింది. ఇక్కడ మొత్తం 20 వరకు హాస్టల్స్​ఉండగా, 8 వేల నుంచి 10 వేల మంది వరకు స్టూడెంట్స్ ఉంటున్నారు. ఒక్కో హాస్టల్​కు రోజూ నాలుగు కమర్షియల్​సిలిండర్లు ఇచ్చేవాళ్లు.. ఇరాక్​–ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా కొరత ఏర్పడడంతో ఇప్పుడు రోజు రెండు సిలిండర్లు మాత్రమే ఇస్తున్నారు. వేపుళ్లు లాంటి వాటికి సిలిండర్ వాడాలని, మిగతా వాటికి అంటే అన్నం, కూరలకు కట్టెల పొయ్యిలపై చేయాలని చెప్పడంతో అలాగే చేస్తున్నారు. అయితే, పొగతో ఇబ్బందులు పడుతున్నామని, వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు రోజూ మూడు పూటలా కట్టెల పొయ్యిపై వండడం కష్టమని కుక్​లు చెప్తున్నారు. దీంతో భోజనం పెట్టడం ఆలస్యం అవుతుందంటున్నారు. 

కట్టెల రేట్లు పెరిగినయ్...

కట్టెలు నిన్న మొన్నటి వరకు రూ.10 కిలో ఉండేవి. ఇప్పుడు రూ. 12కు కిలో అయ్యింది. కొందరు రూ.20 వరకు తీసుకుంటున్నారు. కట్టెలు డిమాండ్ కి సరిపడా రాకపోవడంతో  ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్​కష్టాలు తీరకపోతే ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. –మహ్మద్ ఖాజా కట్టెల షాప్ నిర్వాహకుడు సూరారం

కట్టెలపై చేస్తున్నం...

గ్యాస్ ఇబ్బందులతో కట్టెలపై కుక్ చేస్తున్నం. హోటల్ వద్ద అవకాశం లేకపోవడంతో ఇంటి వద్ద కుక్  చేసుకొని తెస్తున్నం. తప్పనిసరి పరిస్థితుల్లో  మెనూ చేంజ్ చేశాం. రైస్, కర్రీస్, సాంబార్ ఇవన్నీ ఇంటి వద్ద కట్టెల పొయ్యిపై వండి తెస్తున్నం. దీంతో కట్టెలకి డిమాండ్ పెరిగింది. నార్మన్ టైంలో రూ.8 కిలో ఉండగా, ఇప్పుడు రూ.20కిపైగా అమ్ముతున్నారు.  –కిషోర్, పూర్ణ మెస్ నిర్వాహకుడు