హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. శనివారం (జులై 25) ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్ల కోసం కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు వచ్చే జోగినిను ప్రత్యేక మార్గం నుంచి అనుమతి ఇస్తామని తెలిపారు. బోనాలతో వచ్చే సాధారణ మహిళల కోసం రెండు క్యూ లైన్స్ ఏర్పాటు చేశామన్నారు.
అలాగే, సాధారణ ప్రజల కోసం రెండు జనరల్ లైన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పాస్ ఉన్న వాళ్లకు మరో రెండు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంగం రోజు స్వర్ణలత కోసం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. భక్తులకు తక్కువ సమయంలో దర్శనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బోనాల విధుల కోసం 10 క్రైమ్ టీమ్స్‌ని రంగంలోకి దింపుతామని చెప్పారు.
క్రైమ్ టీమ్స్ జులై నెల 31 నుంచి విధుల్లో ఉంటారన్నారు. అనుమానితంగా కనిపించిన వ్యక్తులను అదుపులోని తీసుకుంటారని తెలిపారు. వీఐపీలు వచ్చిన సాధారణ భక్తులను ఆపకుండా దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి పర్యవేక్షిస్తామని తెలిపారు. కాగా, ఆగస్ట్ 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 3వ తేదీన రంగం కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే.
