రైతు బీమా డబ్బులు కాజేసిన కో ఆర్డినేటర్

రైతు బీమా డబ్బులు కాజేసిన కో ఆర్డినేటర్

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ లో మాజీ రైతుబంధు కో ఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి మోసాలు ఒక్కొక్కటిగా బయట పడ్తున్నాయి. చనిపోయిన ఒకే వ్యక్తి పేరిట రెండు వేర్వేరు ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి డబ్బులు కాజేశాడు. రైతు బీమాతో పాటు కార్మిక బీమా సొమ్ము నొక్కేశాడు. 

రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఫకీర్ హుస్సేన్ 2019లో జూన్ 10న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం తుపాకుల గూడెం బ్యారేజీ దగ్గర జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. ఆయన భార్య నామినీగా కార్మిక బీమా 3 లక్షలు కొట్టేశాడు. నకిలీ స్టాంపులతో పుట్టపహాడ్ గ్రామ కార్యదర్శి భాస్కర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మృతుడి భార్య మహబూబా బేగం కు 2019 జూలై 6న నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చి ఆమె ద్వారా బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేయించాడు. లేబర్ కార్యాలయం నుంచి 2020 జూన్ 9న ఆర్థిక సాయం మంజూరైంది. మహబూబా బేగం ఖాతాలో 5 లక్షల 13 వేల 520 జమ అయ్యాయి.  మైనర్లు అయిన కుమారుల పేరు మీద 50 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లా కిరస్థానపల్లిలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ లో మహబూబాబేగంతో సంతకాలు చేయించి మొత్తం డబ్బులు డ్రా చేశాడు. ఫకీర్ హుస్సేన్ అంత్యక్రియలకు కొంత డబ్బు ఖర్చైందని, లక్షన్నర రూపాయలే మిగిలాయని వాటిని మళ్లీ ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించాడు.

ఈ క్రమంలో ఫకీర్ హుస్సేన్  పేరు మీద ఉన్న వ్యవసాయ భూమికి అతని సోదరి సైదాబీ నామినీగా ఉందని గమనించాడు రాఘవేందర్ రెడ్డి. 2019 అక్టోబరు 20న ఫకీర్ హుస్సేన్ మరణించాడంటూ మరోసారి నకిలీ ధ్రువీకరణ పత్రం తయారు చేయించాడు. దీని ద్వారా రైతుబీమా సాయం కోసం దరఖాస్తు పెట్టగా.. సైదాబీ ఖాతాలో 2019 డిసెంబరు 7 న 5 లక్షల రూపాయలు జమ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచి పెట్టాడు. 2019 డిసెంబరు 17 న ధాన్యం డబ్బు జమ చేయిస్తానంటూ... ఆమె ఖాతా నుంచి నాలుగున్నర లక్షలను తన అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. మొత్తమ్మీద చనిపోయిన ఫకీర్ హుస్సేన్ పేరు మీద సుమారు 8 లక్షలకు పైనే కాజేశాడు. 

గతంలో బతికున్న మహిళా రైతు చంద్రమ్మ చనిపోయిందని సర్టిఫికెట్లు సృష్టించి రైతు బీమా డబ్బులు కాజేశాడు రాఘవేందర్ రెడ్డి. వరి కొనుగోలు కేంద్రంలో రైతులను బురిడి కొట్టించి ధాన్యం పక్కదారి పట్టించి లక్షలు లూటీ చేశాడు. నకిలీ ధ్రువపత్రాల కేసులో ఇప్పటికే రాఘవేందర్ రెడ్డి జైలులో ఉన్నాడు. పుట్టాపహాడ్ లో ఉన్న మరో ఐదారుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.