
- కోమటికుంట చెరువు కేసులో ఆధారాలు అందజేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు బఫర్ జోన్‌లో ఎల్‌ఎల్‌పీ నిర్మాణాలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు కోరింది. బాచుపల్లిలోని సర్వే నంబర్ 127/పి, 128/పి, 137/పి లో కోమటికుంట బఫర్ జోన్ ఏరియాలో వాసవి ఇన్‌ఫ్రా సంస్థ నిర్మాణాలు చేయడంపై నిజాంపేటకు చెందిన సతీశ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఆ నిర్మాణాలను నిలిపివేస్తూ హెచ్‌ఎండీఏ ఆదేశాలు జారీ చేయడంతో వాటిని సవాల్ చేస్తూ వాసవీ ఇన్‌ఫ్రా సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌ల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. సతీశ్ లాయర్ వాదనలు వినిపిసూ, ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణాలు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీల్లో నిర్ధారణ అయిందన్నారు. ఇరిగేషన్ శాఖ ఎన్వోసీ ఇచ్చాకే అనుమతులు ఇచ్చామని హెచ్‌ఎండీఏ లాయర్ మాధవీరెడ్డి తెలిపారు. మొత్తం 12 బ్లాక్స్ నిర్మాణాలు జరుగుతుంటే 8, 9 బ్లాక్స్‌పై పిటిషనర్ అభ్యంతరం లేవనెత్తారని వాసవి సంస్థకు చెందిన సీనియర్ అడ్వొకేట్ బి.మయూర్‌రెడ్డి చెప్పారు. బఫర్ జోన్ అని తేలితే నిర్మాణాలను కూల్చేస్తామని తెలిపారు. నిర్మాణాలు అక్రమమని తేలితే ప్లాట్లు కొన్ని వారి దగ్గరి వసూలు చేసిన డబ్బును వాపస్ చేస్తామని చెప్పారు. వాదనల తర్వాత ఆధారాలను అందజేయాలన్న పిటిషనర్ సతీశ్‌ను కోర్టు ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.