ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది

ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది

వరంగల్‍, వెలుగు : నమ్మకమైన పనిమనిషిగా నటిస్తూ యజమాని ఇంట్లో రూ.38 లక్షల విలువ చేసే బంగారు అభరణాలు చోరీ చేసిందో యువతి. ఆ వివరాలను వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్​ఝా వెల్లడించారు. హనుమకొండ సంతోష్‍నగర్‍లో ఉండే డాక్టర్‍ కీసర విక్రమ్‍రెడ్డి ఇంట్లో సూర్యాపేట జిల్లా హుజూర్‍నగర్‍ బిల్యా నాయక్‍ తండాకు చెందిన కత్రి కల్యాణి (28) అలియాస్‍ తునిగర్‍ కళ పనిమనిషి. కల్యాణి విశ్వాసంగా పని చేయడంతో యజమాని, కుటుంబసభ్యులు నమ్మారు. దీంతో ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు వారు వేసుకున్న నగలను కల్యాణికి ఇచ్చి బీరువాలో పెట్టమనేవారు. 

దీంతో కల్యాణికి నగలపై ఆశ పుట్టింది. అప్పుడప్పుడు దాచమని ఇచ్చిన జ్యువెల్లరీని చోరీ చేసి ఆటో డ్రైవర్‍గా పనిచేసే నెక్కొండ మండలం గొల్లపల్లికి చెందిన ప్రియుడు మూడు చంటితో పాటు మహబూబాబాద్‍ జిల్లా నెల్లికుదురు అవుసల తండాకు చెందిన అక్క మౌర్య సునీత (34)కు ఇచ్చేది. ఇలా నాలుగు దఫాలుగా 650 గ్రాముల బంగారు అభరణాలు చేరవేసింది. ఇందులో కొంత బంగారాన్ని అమ్మి కారు కొనుగోలు చేసింది. కొద్దికాలం తర్వాత ఏదో ఫంక్షన్ ​రావడంతో విక్రమ్​రెడ్డి కుటుంబసభ్యులు జ్యువెల్లరీ కోసం చూడగా కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి సుబేదారి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కల్యాణిని నిందితురాలిగా గుర్తించారు. 

నిఘా పెట్టి శుక్రవారం కారులో వరంగల్​లో వెళ్తుండగా ఇన్​స్పెక్టర్​సత్యనారాయణ సిబ్బందితో కలిసి ఫారెస్ట్ ఆఫీస్‍ జంక్షన్​లో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా విక్రమ్‍రెడ్డి ఇంట్లో దొంగతనం చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. చోరీ చేసిన బంగారాన్ని ఓ ఫైనాన్స్​ కంపెనీలో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో కారు కొన్నట్టు తెలుసుకున్నారు. 90 శాతం బంగారాన్ని రికవరీ చేశామని పోలీసులు చెప్పారు. కేసును ఛేదించిన సెంట్రల్‍ జోన్‍ డీసీపీ అబ్దుల్‍ బారీ, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‍రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు రాజయ్య, పర్వీస్‍ తదితర సిబ్బందిని సీపీ అభినందించి  రివార్డు అందజేశారు.