
- గన్ పార్క్ వచ్చి అమరవీరుల స్థూపాన్ని మలినం చేశారు
- హరీశ్ రాజీనామాను ఆమోదించే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడి
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల చావుకు మాజీ మంత్రి హరీశ్ రావు కారణమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. శుక్రవారం గన్ పార్క్ వద్దకు హరీశ్ రావు వచ్చి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నాయకులతో కలిసి బల్మూరి వెంకట్ అక్కడికి చేరుకున్నారు. అమరవీరుల మరణానికి కారకుడైన హరీశ్ రావు గన్ పార్క్ రావడంతో ఈ ప్రాంతం మలినమైందని పేర్కొంటూ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్లుగా బీఆర్ఎస్ నాయకులకు, హరీశ్ రావుకు ఏనాడు గుర్తుకురాని అమరవీరులు.. ఇప్పుడే గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు.
హరీశ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కూడా.. రాజీనామా ఎలా చేయాలో తెలీదా అని నిలదీశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారని విమర్శించారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే , బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా..? అని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరానని గుర్తుచేశారు. కానీ హరీశ్ తన రాజీనామా లేఖతో కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.
హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌లో జీతగాడు..
హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఒక జీతగాడు మాత్రమేనని.. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన రేపు బీజేపీలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బల్మూరి వెంకట్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారని స్పష్టం చేశారు. ఆగస్టు 15 తర్వాత హరీశ్ రావు రాజీనామా ఆమోదం పొందేలా ఎమ్మెల్సీగా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, విద్యార్థి నాయకుడినైన తనపై 88 కేసులు పెట్టి, జైల్లో వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, సర్కార్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పారు.