ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల తీర్పు కాపీలు పిటిషనర్లకు..సుప్రీంకోర్టు ఆదేశాలతో పంపించిన స్పీకర్ ఆఫీస్

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల తీర్పు కాపీలు పిటిషనర్లకు..సుప్రీంకోర్టు ఆదేశాలతో పంపించిన స్పీకర్ ఆఫీస్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయగా.. తీర్పు కాపీలను స్పీకర్ కార్యాలయం పిటిషన్ దారులకు పంపించింది. ఈ తీర్పు కాపీలను 24 గంటల్లోగా పిటిషన్ దారులకు పంపించాలని స్పీకర్ ను గురువారం సుప్రీంకోర్టు ఆదేశించడంతో శుక్రవారం సాయంత్రం చేరవేశారు.

దానం నాగేందర్ పై వేసిన అనర్హత పిటిషన్ ను ఏ కారణంతో డిస్మిస్ చేయాల్సి వచ్చిందో అందుకు గల కారణాలను తన తీర్పు కాపీలో స్పీకర్ వెల్లడించారు. 42 పేజీల కాపీని పిటిషన్ దారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి స్పీకర్ కార్యాలయం చేరవేసింది. కడియం శ్రీహరిపై వేసిన అనర్హత పిటిషన్ ను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో 60 పేజీల తీర్పులో స్పీకర్ వివరించారు.

తీర్పు కాపీని పిటిషన్ దారు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు పంపించింది. ఈ పిటిషన్లను ఎందుకు కొట్టేయాల్సి వచ్చిందనేది తీర్పు కాపీలో స్పీకర్ పలు క్లాజ్ లను ఉదహరిస్తూ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అనర్హత పిటిషన్లను అక్కడి స్పీకర్లు ఏ విధంగా తిరస్కరించారో ప్రస్తావించారు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పులను కూడా ప్రస్తావిస్తూ వాటి ఆధారంగానే తాను ఈ తీర్పును ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.