4 రోజుల్లో రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరి

4 రోజుల్లో రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరి

న్యూఢిల్లీ: చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియాతోపాటు గ్లోబల్​ మార్కెట్లకు శుక్రవారం ‘బ్లాక్​ఫ్రైడే​’గా మారింది. ఇండెక్స్​లు కుప్పకూలాయి. వరుసగా నాలుగో రోజూ నష్టాలే మిగిలాయి. పొద్దున్నే నెగెటివ్​గా మొదలైన మార్కెట్లు ఆద్యంతం అదేబాటలో కదలాడాయి. సెన్సెక్స్ 981 పాయింట్లు తగ్గింది.  నాలుగు సెషన్లలో పెట్టుబడిదారులు రూ. 15 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.  శుక్రవారం ఒక్క రోజే రూ. 8 లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. సెన్సెక్స్ 980.93 పాయింట్లు తగ్గి 59,845.29 వద్ద స్థిరపడింది. -- ఈ ఏడాది అక్టోబర్ 28 తర్వాత మానసికంగా కీలకమైన 60 వేల మార్క్ దిగువన ముగిసింది.  నిఫ్టీ 320.55 పాయింట్లు   పడిపోయి 17,807 వద్ద ముగిసింది. టైటాన్ మినహా, టాటా స్టీల్ , టాటా మోటార్స్, ఎస్‌‌‌‌బిఐ, బజాజ్ ఫిన్‌‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ  ఎల్‌‌అండ్‌‌టి నాయకత్వంలోని అన్ని సెన్సెక్స్ స్టాక్‌‌లు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు గడచిన నాలుగు సెషన్లలో రూ. 15.78 లక్షల కోట్లను కోల్పోయారు. బీఎస్‌‌ఈ- లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,72,12,860.03 కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ కేవలం 4 రోజుల్లో దాదాపు 2,000 పాయింట్లు పడిపోయింది. ఇది ఈ నెలలో  3,250 పాయింట్లు (5.1శాతం) నష్టపోయింది.  బేరిష్ సెంటిమెంట్ల ప్రకారం, డిసెంబర్ చివరి ఐదు ట్రేడింగ్ రోజులు,  జనవరి మొదటి 2 రోజులలో సాధారణంగా స్టాక్ ధరలు పెరుగుతుంటాయి. అయితే మార్కెట్‌‌లో ఈసారి శాంటా ర్యాలీ  కనిపించడం లేదు. 

స్టాక్ మార్కెట్ పడటానికి ఇవీ ముఖ్యమైన కారణాలు

1 యూఎస్​ డేటా

వినియోగదారుల నమ్మకం, జాబ్‌‌‌‌డేటా,  జీడీపీ క్యూ3 సంఖ్యలకు సంబంధించి యూఎస్​ నుంచి వచ్చిన డేటా ఆశ్చర్యపరిచింది. దీనివల్ల ఫెడ్ రేట్ మరింతగా రేట్లను పెంచుతుందనే భయాలు ఎక్కువయ్యాయి.  యూఎస్​ క్యూ3 జీడీపీ అంచనా 2.9 శాతం కాగా, 3.2శాతం వృద్ధిని సాధించింది.  ఇనీషియల్​జాబ్​లెస్​ క్లెయిమ్‌‌లు 2,22,000 కాగా, అంచనాల కంటే కొద్దిగా ఎక్కువగా 2,16,000కి పెరిగాయని ఒనడా  మార్కెట్ ఎనలిస్ట్​ ఎడ్వర్డ్ మోయా చెప్పారు.

2 కొవిడ్ భయాలు

చైనాలో ఇన్ఫెక్షన్లు విజృంభిస్తున్నందున కొవిడ్‌‌కు సంబంధించిన భయాలు పెట్టుబడిదారులను మరోసారి ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. చైనాలో రోజుకు  మిలియన్ కొవిడ్ కేసులు,  5,000 మరణాలు ఉన్నాయని బ్లూమ్‌‌బెర్గ్ గురువారం పేర్కొంది. కొవిడ్ వార్తలకు మార్కెట్‌‌ విపరీతంగా  స్పందిస్తున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి. కె. విజయకుమార్ అన్నారు.  కొవిడ్‌‌పై యుద్ధం ఇంకా ముగియలేదని భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. 

3 జపాన్ ఇన్​ఫ్లేషన్​

ఆసియా మార్కెట్లను ఒత్తిడి కారణాల్లో ఒకటి జపాన్ ఇన్​ఫ్లేషన్​ డేటా కూడా. ఇది ఈ ఏడాది నవంబర్‌‌లో 40 సంవత్సరాల గరిష్ట స్థాయి 3.7శాతానికి చేరుకుంది.  అన్ని రకాల వస్తువులు ధరలు రికార్డుస్థాయిలో పెరిగాయి. జపాన్‌‌కు చెందిన స్టాక్​ మార్కెట్​ ఇండెక్స్​ నిక్కీ ఈ ఏడాది జూన్ నుంచి విపరీతంగా నష్టపోతోంది. 

4 వాల్ స్ట్రీట్ సూచనలు

ఫెడ్ వడ్డీ రేటు పెంపుదలకు సంబంధించిన భయాల మధ్య డౌ జోన్స్ ఒకశాతానికి నష్టాలతో ముగియగా, నాస్‌‌డాక్‌‌ 2.18శాతం పడింది.  బెంచ్‌‌మార్క్ ఎస్​&పీ వార్షికంగా 19.8శాతం పతనమైంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంత భారీగా నష్టపోవడం ఇదేమొదటిసారి. ఆర్థిక డేటా మాత్రం బాగుందని ఈక్విటీ మార్కెట్ల ఎనలిస్టులు అంటున్నారు. 

5 టెక్నికల్​ విషయాలు 

దలాల్ స్ట్రీట్‌‌లో నిరాశావాదం పెరుగుతుందని సూచిస్తూ, హెడ్‌‌లైన్ ఈక్విటీ ఇండెక్స్ నిఫ్టీ గురువారం రోజువారీ చార్టులో బేరిష్ ఎన్‌‌లింగ్ ప్యాటర్న్‌‌ను ఏర్పరచింది. నిఫ్టీకి 18,000 మార్క్ వద్ద బలమైన మద్దతు ఉంది. ఇది శుక్రవారం బ్రీచ్​ అయింది. ఆప్షన్​​ డేటా 17500 నుంచి 18300 జోన్‌‌ల మధ్య వైడర్​ ట్రేడింగ్ రేంజ్​లో మార్పును సూచిస్తోంది. అయితే 17600 నుంచి 18100 జోన్‌‌ల మధ్య ఇమీడియేట్​ రేంజ్​ను సూచిస్తోందని ఒక ఎనలిస్టు తెలిపారు.

6 సంవత్సరాంతపు ఒత్తిడి

నెల, క్వార్టర్​,  క్యాలెండర్ సంవత్సరాంతానికి ముందు పెట్టుబడిదారులు లాభాలను బుక్​ చేయడానికి,  నగదును తీసుకోవడానికి పరుగెత్తడం వల్ల నిఫ్టీ పెరుగుదలపై ఒత్తిడి  కనిపిస్తోందని ఎనలిస్టు దీపక్ జసానీ చెప్పారు. మార్కెట్లో మరింత కరెక్షన్​ రావొచ్చని అమోల్​ అథవాలే అనే మరో ఎనలిస్టు హెచ్చరించారు.