- ఆగస్టులో 8,79,479 టెస్టులుచేసినట్టు కేంద్రానికి డేటా
- రాష్ట్ర బులెటిన్ లో 9,65,253 టెస్టులు చేసినట్టు ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల లెక్కలపై తొలి నుంచీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర సర్కారు.. టెస్టుల వివరాల్లోనూ అట్లాగే చేస్తోంది. టెస్టుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వానికి ఓ లెక్క చెప్తూ.. స్టేట్ హెల్త్ బులెటిన్‌లో మరో లెక్కను చూపుతోంది. తెలంగాణలో ఆగస్టు నెలలో 8 లక్షల 79 వేల 479 మందికి కరోనా టెస్టులు చేసినట్టు కేంద్రానికి రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చింది. ఇటీవల కేంద్ర హెల్త్ మినిస్టర్ పార్లమెంట్‌లోనే ఈ వివరాలను వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర సర్కారు బులెటిన్‌లో మాత్రం.. ఆగస్టులో 9 లక్షల 65 వేల 253 టెస్టులు చేసినట్టు చెప్తోంది. కేంద్రానికి ఇచ్చిన లెక్కకు, బులెటిన్‌లో చెప్పిన లెక్కకు 85 వేల 774 టెస్టుల తేడా ఉంది. అంటే తక్కువ టెస్టులు చేసి ఎక్కువగా చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇలా అసలు లెక్కలు బయటపడతాయనే ఉద్దేశంతోనే జిల్లాల వారీగా టెస్టులు, డెత్స్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
చాలా జిల్లాల్లో రోజూ వెయ్యి లోపే..
వేలకొద్దీ కరోనా కేసులు నమోదవుతున్నా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అరకొరగానే టెస్టులు చేస్తున్నారు. ఉదాహరణకు భూపాలపల్లి జిల్లాలో ఆగస్టులో 4,270 టెస్టులు, వికారాబాద్ జిల్లాలో 5,268 టెస్టులు మాత్రమే చేశారు. మొత్తం 33 జిల్లాలకుగాను 27 జిల్లాల్లో రోజూ వెయ్యి కంటే తక్కువే టెస్టులు చేసినట్టు కేంద్రం వెల్లడించిన నివేదికతో వెల్లడైంది. స్టేట్ బులెటిన్‌లో రోజూ రాష్ట్రవ్యాప్తంగా 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అయితే ఏ జిల్లాలో ఎన్ని చేశారో చెప్పడం లేదు. దీంతో అన్ని టెస్టులు చేస్తున్నారా, చేయకుండానే చేసినట్టుగా చూపిస్తున్నారా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. టెస్టుల సంఖ్యే కాదు.. కరోనా కేసులు, డెత్స్ లెక్కలు కూడా అవాస్తవాలేనని క్షేత్రస్థాయిలో పనిచేసే డాక్టర్లు, జిల్లాల మెడికల్ ఆఫీసర్లే చెప్తున్నారు. రోజూ నమోదవుతున్న కేసులు, డెత్స్లో సగం కూడా బయటపెట్టడం లేదని అంటున్నారు. అసలు లెక్కలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల్లో బులెటిన్లు ఇవ్వొద్దని ఆదేశించారని పేర్కొంటున్నారు.
ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తలేరు
కరోనా టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ సూచనలను రాష్ట్ర సర్కారు పాటించడం లేదు. కరోనా లక్షణాలున్నవాళ్లకు యాంటీ జెన్ టెస్టులో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం లేదు. యాంటీ జెన్ టెస్టులో ఫాల్స్ నెగెటివ్ (వైరస్ ఉన్నా లేనట్టు చూపించడం) వచ్చే అవకాశాలు 40 శాతం దాకా ఉందని ఐసీఎంఆర్ మొదట్నుంచీ చెప్తూనే ఉంది. లక్షణాలుండి యాంటీజెన్లో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ చేయించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో యాంటీ జెన్ టెస్టులు చేసి వదిలేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు. రాష్ట్రంలో రోజూ 6 వేలదాకా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. అందులో సగం కూడా చేయడం లేదని హెల్త్ డిపార్ట్మెంట్ వర్గాలు చెప్తున్నాయి.
