గాంధీలో కరోనా పేషెంట్లు మళ్లీ పెరుగుతున్నరు

గాంధీలో కరోనా పేషెంట్లు మళ్లీ పెరుగుతున్నరు

పద్మారావునగర్ (హైదరాబాద్), వెలుగు:  గాంధీ హాస్పిటల్ లో కరోనా పేషెంట్ల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత వారం మొత్తం 39 మంది కరోనా పేషెంట్లే ఉండగా, శనివారం వీళ్ల సంఖ్య 65కు పెరిగింది. ఇతర రాష్ట్రాల్లోనూ మళ్లీ కేసులు పెరుగుతుండటంతో స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ అలర్ట్ అయింది. వైద్య శాఖ ఆదేశాల మేరకు గాంధీలోని మెయిన్​ బిల్డింగ్ సెకండ్​ ఫ్లోర్​లో150 బెడ్లతో స్పెషల్​ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డులో కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ కోసం సీనియర్​ రెసిడెంట్​ డాక్టర్లతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హౌస్ సర్జన్లు, నర్సులు, పేషేంట్​కేర్​సిబ్బంది సహా మొత్తం160 మంది ఇరవై నాలుగు గంటల పాటూ డ్యూటీలో ఉంటారని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. కరోనా సింప్టమ్స్ స్వల్పంగా ఉన్నవాళ్లను గచ్చిబౌలి టిమ్స్, కింగ్ కోఠి దవాఖాన్లకు పంపుతున్నామని తెలిపారు. సీరియస్ సింప్టమ్స్ ఉన్నవాళ్లను మాత్రమే గాంధీలో అడ్మిట్ చేసుకుంటున్నామని చెప్పారు. గాంధీకి వచ్చే పాజిటివ్ పేషెంట్లలో వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాట్లు చేశామని, ఇక్కడే పేషెంట్లను డాక్టర్లు పరీక్షించి, ట్రీట్ మెంట్ కు రిఫర్ చేస్తారన్నారు. గాంధీలో 400 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించిన తర్వాత గాంధీలో ఓపీ పెరుగుతోందన్నారు. రోజూ1,500 మంది వరకూ ఓపీకి వస్తున్నారని, 1000 మంది అడ్మిట్ అయి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వివరించారు.