రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి  టీకా ఫస్ట్ డోస్

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి  టీకా ఫస్ట్ డోస్
  • అందుబాటులో 10 లక్షల డోసులు 
  • త్వరలో జిల్లాల్లో మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లు 
  • ఇప్పటి వరకు 40.18 లక్షల మందికి పూర్తయిన వ్యాక్సినేషన్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ స్పీడ్ పెంచాలని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ నిర్ణయించింది. ప్రస్తుతం సెకండ్ డోసు వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ వేస్తుండగా, బుధవారం నుంచి ఫస్ట్ డోసు కూడా ప్రారంభించనుంది. సుమారు 10 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని, అందుకే ఫస్ట్ డోసు ప్రారంభించాలని నిర్ణయించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు మంగళవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు చివరి కల్లా సెకండ్ డోసు వేయించుకోవాల్సిన వాళ్ల సంఖ్య దాదాపు 40 లక్షలు ఉండడంతో.. జులై చివరి వారం నుంచే 21 జిల్లాల్లో ఫస్ట్ డోసు వేయడం ఆపేశారు. బుధవారం నుంచి ఆయా జిల్లాల్లో ఫస్ట్ డోసు తిరిగి ప్రారంభం కానుంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 40.18 లక్షల మందికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మరో 76.83 లక్షల మంది సింగిల్ డోసు వేసుకున్నారు. దాదాపు ఇంకో కోటి 43 లక్షల మందికి ఒక్క డోసు కూడా అందలేదు. 

గ్రేటర్లో హయ్యెస్ట్.. 

గ్రేటర్ హైదరాబాద్లో వ్యాక్సినేషన్ స్పీడ్గా జరుగుతోంది. ఇక్కడ మొత్తం 90.3 లక్షల జనాభా ఉండగా, 18 ఏండ్లు నిండినోళ్లు 55.75 లక్షల మంది ఉన్నారు. వీరిలో 14.16 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మరో 32.63 లక్షల మంది (58.54 శాతం) సింగిల్ డోసు వేయించుకున్నారు. మొత్తంగా 83.54 శాతం మంది కనీసం ఒక్క డోసైనా వేయించుకున్నారు. ఇంకో 9 లక్షల మంది మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్క డోసు కూడా తీసుకోలేదు. కాగా, జిల్లాల్లో మాత్రం వ్యాక్సినేషన్ ఇప్పటికీ 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కేసుల సంఖ్య ఇప్పటికీ తగ్గకపోవడంతో.. ఆ జిల్లాలకు ఎక్కువ వ్యాక్సిన్లు పంపిస్తున్నారు. నారాయణపేట్, ములుగు, గద్వాల్ వంటి మారుమూల జిల్లాల్లో వ్యాక్సినేషన్ స్లోగా సాగుతోంది.