కరోనా బాధితులను గాలికొదిలేసిన్రు

కరోనా బాధితులను గాలికొదిలేసిన్రు

 అన్ని చర్యలు బంద్ పెట్టిన సర్కారు

పాజిటివ్ వ్యక్తులను పట్టించుకునుడు లేదు

వైరస్ లక్షణాలతో బయట తిరుగుతున్న జనం

పెండ్లళ్లు, ఫంక్షన్లకు వందల్లో జనాలు

లైట్ తీసుకుంటున్న పోలీసులు

హైదరాబాద్‌, వెలుగు: కరోనా కట్టడిని సర్కారు బంద్‌ పెట్టింది. అంతా గాలి కొదిలేసింది. అటు సరిపడా టెస్టులు చేయకపోగా ఇటు ట్రేసింగ్ ఆపేసింది. ప్రైమరీ, సెకండరీ కాం టాక్ట్ లు ఎవరనేది కూడా విచారణ చేయట్లేదు. దీంతో కాంటాక్ట్‌ వ్యక్తులు వైరస్ క్యారియర్లుగా మారుతున్నరు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కూడా పట్టించుకునేవాళ్లు కరువయ్యారు. చాలా మందికి హోమ్ ఐసోలేషన్‌ కిట్లు కూడా ఇవ్వట్లేదు. వైరస్ సోకకుండా బస్సులు, బస్టాండ్లు , పబ్లిక్ ప్లేసుల్లో శానిటేషన్‌ కూడా చేయడం లేదు. పెండ్లిళ్లు, పేరంటాలకు లెక్కకు మించి జనాలు హాజరవుతున్నా చూసీచూడనట్టు ఉంటున్నరు. రోడ్లపై అర్ధరాత్రి వరకూ తిరుగుతున్నా పోలీసులు కనీసం ప్రశ్నించట్లేదు.

కరోనా వచ్చినా చాలా మందిలో లక్షణాలుండట్లేదు. కేవలం 10 నుంచి 20 శాతం మందికే వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులోనూ శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్నవాళ్లను , వేరే తీవ్రమైన ఇబ్బందులున్న వాళ్లనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నా రు. లక్షణాల్లేకుంటే హోం ఐసొలేషన్‌‌లో ఉండాలని చెప్పి పంపుతున్నారు. తొలినాళ్లలో పాజిటివ్ వ్యక్తులకు రోజూ పొద్దూ మాపూ ఫోన్లు చేసి పరామర్శించిన డాక్టర్లు ఇప్పుడు మొత్తం ఐసోలేషన్ పీరియడ్‌‌లో ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు. ఆరోగ్య శాఖ ఇచ్చిన టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌కు ఫోన్ చేస్తే ఎప్పుడూ బిజీగానే ఉంటోంది. దీంతో ఏ మందులు వాడాలో, ఐసోలేషన్‌‌లో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు సోషల్ మీడియాపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ఫార్మా కంపెనీలు టీవీల్లో,సోషల్ మీడియాలో తమ ప్రాడక్టులపై విపరీతమైన యాడ్లు ఇస్తున్నాయి. .

ఆస్తులు అమ్ముకుంటున్నరు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, ఆక్సిజన సౌకర్యం గురించి తప్ప వైరస్ కట్టడి గురించి ప్రభుత్వ పెద్దలు ఊసెత్తడం లేదు. వేలల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పినా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు జనం ఇష్టపడట్లేదు. ప్రైవేటుకు వెళ్తేనేమో లక్షల్లో బిల్లులేస్తున్నారు. వాళ్లను కంట్రోల్‌‌ చేయాల్సిన సర్కారు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతోంది. దీంతో బాధితులు ప్రాణాల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్రంలో ఇప్పటికే లక్షల మంది వైరస్ బారిన పడగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం మాత్రం కేసులు, మరణాల లెక్కలను తప్పుగా ప్రకటిస్తూ వైరస్ కట్టడి చర్యలను నిలిపేసింది.

అప్పుడేమో హడావుడి చేసిన్రు..

రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా అలజడి స్టార్టయింది. వైరస్ లక్షణాలున్నా లేకున్నా విదేశాల నుంచి వచ్చినోళ్లను క్వారంటైన్ చేశారు. లక్షణాలున్నట్టు తెలిస్తే ఇంటి కే అంబులెన్స్‌ పంపి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చే వరకూ ఐసోలేషన్‌లో ఉంచారు. కాంటాక్ట్​లను ట్రేసింగ్ చేసేవారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను క్వారంటైన్‌ చేసి లక్షణాలున్న వాళ్లను టెస్టు లకు పంపేవాళ్లు. మున్సిపల్ ఆఫీసర్లు పారిశుద్ధ్య కార్మికులతో వెళ్లి బాధితుల ఇండ్ల వద్ద శానిటైజ్ చేసేవాళ్లు. ఆ ఇంటి చుట్టు పక్కలకు కూడా ఎవర్నీ వెళ్లనిచ్చేవాళ్లు కాదు. పబ్లిక్ ప్లేసుల్లో శానిటైజ్ చేసేవాళ్లు. సీఎం కేసీఆర్‌ కూడా 15 రోజులకు ఓసారి అధికారులను పిలిపించుకుని మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు భరోసా కల్పించే మాటలు చెప్పడం చేశారు.

ఇప్పుడంతా బంద్‌ జేసిన్రు..

కరోనా వచ్చిన తొలి నాళ్లలో సర్కార్ చర్యలకు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు అసలు పొంతనే లేదు. కరోనా కట్టడి సర్కారు దృష్టిలో అసలు ప్రాధాన్యం లేని అంశమైంది. వైరస్ లక్షణాలతో జనం బయట తిరుగుతున్నా, టెస్టు ల కోసం లైన్లు కట్టి ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవట్లేదు. శానిటేషన్‌ బంద్ పెట్టారు. పక్కింట్లో పాజిటివ్ పేషెంట్లు ఉన్న విషయం కూడా జనాలకు తెలియడం లేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులే నిత్యావసరాలకు బయటకు వస్తున్నారు. పోలీసులు పాజిటివ్ వ్యక్తుల ఇండ్లవైపు చూడట్లేదు. కరోనా కేసులు ప్రారంభమైన తొలి నాళ్లలో టెస్టింగ్, ట్రేసింగ్‌, ట్రీట్మెంట్, శానిటేషన్‌ కోసం ఒక్కో టీమ్‌ పనిచేసేది. ఇప్పుడు వైరస్ కట్టడి చర్యలు బంద్‌ పెట్టడంతో వీటిల్లో ని ఉద్యోగులు వేర్వేరు పనుల్లో నిమగ్నమయ్యారు.