భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత అరుదైన, అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌లలో ఒకటిగా ప్రభాస్ , ఎస్.ఎస్. రాజమౌళి జోడీ నిలిచింది. వీరి కలయిక అంటే ప్రేక్షకులలో, అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. 'ఛత్రపతి' (2005) లాంటి మాస్ హిట్‌తో మొదలైన వీరి ప్రయాణం, 'బాహుబలి' సిరీస్‌తో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసే వరకు వెళ్ళింది. 'బాహుబలి' ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడిగా నిలబెట్టగా, రాజమౌళిని గ్లోబల్ ఫిల్మ్ మేకర్‌గా మార్చింది.
ప్రభాస్- రాజమౌళి కాంబోలో మారో మూవీ..
అయితే ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ కాంబోలో మరో అద్భుతం రూపుదిద్దుకోబోతోందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి, అది 'బాహుబలి' లాంటి ఫాంటసీ కథ కాకుండా.. ఒక శక్తివంతమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. 'బాహుబలి' సిరీస్ మొదలు పెట్టడానికి ముందు, రాజమౌళి ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ కు రెండు కథలను వివరించారని విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం. వాటిల్లో ఒకటి భారీ ఫాంటసీ కథ 'బాహుబలి'. రెండవది బాక్సింగ్ నేపథ్యంలో సాగే, బలమైన భావోద్వేగాలు,నాటకీయతమేళవింపుతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్.
ఈ రెండింటిలో ఒకటైన 'బాహుబలి' తెరపైకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. ఏకంగా రూ. 2000 కోట్లు వసూలు చేసి అంతర్జాతీయ మైలురాయిని తాకింది. దీంతో తాత్కాలికంగా పక్కన పెట్టిన రెండవ కథ ఇప్పుడు తిరిగి డిస్కషన్ టేబుల్ మీదకు వచ్చిందని సమాచారం. ప్రభాస్‌కు సరిగ్గా సరిపోయే పవర్-ప్యాక్డ్ రోల్ ఇందులో ఉందని తెలుస్తోంది.
మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాతే...
ప్రస్తుతం రాజమౌళి దృష్టి అంతా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 పైనే ఉంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేదికపైనే సినిమా టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేయనున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉంది.
►ALSO READ | Raju Weds Rambai Trailer: ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు.. ఆసక్తిగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ట్రైలర్
SSMB29 విడుదలైన తర్వాతే, రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే.. డార్లింగ్- జక్కన్న కొంబోలో మరో చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక ఊహించని, అద్భుతమైన కానుక అవుతుంది. తమ అభిమాన హీరో, దర్శకుడు పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయడం భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
