పూణెలో పెను విషాదం.. బ్రేకులు ఫెయిల్ అయి ఘోరం.. మంటల్లో 8 మంది సజీవ దహనం

పూణెలో పెను విషాదం.. బ్రేకులు ఫెయిల్ అయి ఘోరం.. మంటల్లో 8 మంది సజీవ దహనం

పూణె: పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం పూణెలోని ఒక బ్రిడ్జిపై సరుకులతో వెళుతున్న ట్రక్కు ఆరు వాహనాలను ఢీ కొట్టింది. ఈ కారణంగా.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు-ముంబై జాతీయ రహదారి-4లో గూడ్స్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రక్కు అదుపు తప్పి ముందు వెళుతున్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు చెలరేగాయి. ఏడెనిమిది వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఫలితంగా ఎనిమిది మంది మరణించారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ధ్వంసమైన వాహనాలతో, గాయపడిన వ్యక్తుల శరీర భాగాలతో హైవే బీతావహంగా కనిపించింది. నవాలే వంతెన దగ్గరలోని గవగడ హోటల్ ముందు ఈ ప్రమాదం జరిగింది. సతారా నుంచి పూణే వెళ్లే రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత, హైవేపై వాహనాలు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. మంటలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల కొన్ని వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలను ఆర్పడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు అగ్నిమాపక సిబ్బందిని స్పాట్కు పంపించారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాు. పోలీసు సిబ్బంది కూడా ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు సజావుగా సాగేలా అక్కడ గుమిగూడిన జనాన్ని చెదరగొట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత, ధ్వంసమైన, మంటల్లో తగలబడిన వాహనాల నుంచి కాలిపోయిన మృతదేహాలను వెలికితీసిన దృశ్యాలు చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయిన పరిస్థితి.