ఇదేం కక్కుర్తి.. 8 లక్షల కారులో నుంచి దిగి.. 8 రూపాయల న్యూస్ పేపర్ దొంగతనం !

ఇదేం కక్కుర్తి.. 8 లక్షల కారులో నుంచి దిగి.. 8 రూపాయల న్యూస్ పేపర్ దొంగతనం !

మన దేశంలో కొందరి ప్రవర్తన, బుద్ధి విచిత్రంగా అనిపిస్తుంది. వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటారు. ఫుట్ పాత్ల దగ్గర అమ్మే వంద, రెండొందల రూపాయల ఇయర్ ఫోన్స్ గురించి బేరాలాడుతుంటారు. కోట్ల టర్నోవర్ బిజినెస్ చేస్తుంటారు. ఉద్యోగులకు సోన్ పాపిడి ఇచ్చి సరిపెట్టుకోమంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఒక టిపికల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి గురించే. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక వింత ఘటన జరిగింది. 8 లక్షల విలువైన కారు నడుపుతున్న ఒక వ్యక్తి.. ఒక న్యాయవాది కార్యాలయం బయట ఉన్న 8 రూపాయల ఖరీదు చేసే న్యూస్ పేపర్ను.. అదేనండీ వార్తా పత్రికను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కాడు. బుధవారం ఉదయం 9.55 గంటల ప్రాంతంలో మహల్ రోడ్డులోని మహారాణా ప్రతాప్ కాలనీలో ఈ దొంగతనం జరిగింది.

న్యాయవాది సంజీవ్ బిల్గయ్య తన లా ఛాంబర్ లోపల ఒక సహోద్యోగితో ఒక కేసు గురించి చర్చిస్తున్న సమయంలో ఈ దొంగతనం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఒక డిజైర్ కారు.. ఛాంబర్ బయట ఆగి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ కారులో నుంచి దిగిన ఒక వ్యక్తి.. అటూఇటూ చూస్తూ.. ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని చూశాడు. ఎవరూ తనను గమనించడం లేదని డిసైడ్ అయి.. రెయిలింగ్‌లోకి దూరి.. తన చేతులను దూర్చి మరీ.. కాస్తంత దూరంలో ఉన్న న్యూస్ పేపర్ను లాక్కోవడానికి ప్రయత్నించాడు.

►ALSO READ | పూణెలో పెను విషాదం.. బ్రేకులు ఫెయిల్ అయి ఘోరం.. మంటల్లో 8 మంది సజీవ దహనం

ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు. మళ్లీ ట్రై చేసి.. ఎట్టకేలకు ఆ న్యూస్ పేపర్ ను దొంగిలించి.. తర్వాత ప్రశాంతంగా వెళ్లి తన కారులో కూర్చున్నాడు. ఆఫీస్ లోపల నుంచి ఒకరు గమనించి వచ్చేసరికి అక్కడ నుంచి కారులో ఉడాయించాడు. న్యాయవాది బిల్గియా.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఫుటేజీని పరిశీలించి.. న్యూస్ పేపర్ దొంగ కోసం వెతుకులాట సాగించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఈ దొంగ పని పట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అంత కక్కుర్తి పడి న్యూస్ పేపర్ దొంగిలించి చదువుకునే బదులు కొనుక్కోవచ్చుగా అని కామెంట్ చేస్తున్నారు.