హైదరాబాద్: కాచిగూడలో ఒక ఆగంతకుడు రైల్వే ట్రాక్ కింద అడ్డంగా కారు వదిలేసి వెళ్లిన ఘటన కలకలం రేపింది. బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ కింద కారు అడ్డంగా పెట్టి, కారు వదిలేసి వెళ్లడంతో ఆ కారులో ఏముందో అనే భయం స్థానికులను కంగారు పెట్టేసింది. రైల్వే ట్రాక్ కింద రోడ్డుపై రాకపోకలపై పోలీసులు తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కారు బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించారు. ఢిల్లీ పేలుళ్లు ఘటనతో పోలీసులు అలర్ట్ అయి హైదరాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైల్వే ట్రాక్ కింద పార్క్ చేసి ఉండటంతో కొంత హడావుడి నెలకొంది. అయితే.. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్య లేదని పోలీసులు నిర్ధారించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసులు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ తదితర స్టేషన్లలో హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి ప్రయాణికుల సామగ్రిని స్క్రీనింగ్ చేశారు. అనుమానాస్పద లగేజీ, వ్యక్తులు కనిపిస్తే ఆర్పీఎఫ్ లేదా రైల్వే సిబ్బందికి తెలియజేయాలని కోరారు. మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లలో పోలీసులు ఇప్పటికే తనిఖీలు చేశారు.
