తమిళ యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథన్, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'డ్యూడ్' (Dude). దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
రూ.100 కోట్ల క్లబ్‌లో హ్యాట్రిక్..
'లవ్ టుడే' (Love Today), 'గుడ్ నైట్' (Good Night) లాంటి భారీ విజయాల తర్వాత, ప్రదీప్ రంగనాథన్‌కు వరుసగా మూడవ రూ.100 కోట్ల సినిమాగా 'డ్యూడ్' నిలిచింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయం ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ విలువను, యువ ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఈ సూపర్ హిట్ చిత్రం నవంబర్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
కథాంశం..
దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన 'డ్యూడ్' కథాంశం అగన్ (ప్రదీప్), కురళ్ (మమితా బైజు) అనే ఇద్దరు బాల్య స్నేహితులు చుట్టూ తిరుగుతుంది. వీరు కలిసి 'సర్ ప్రైజ్ డ్యూడ్' అనే ఈవెంట్ ప్లానింగ్ కంపెనీని నడుపుతుంటారు. వీరి స్నేహం, అనుబంధం బలపడిన తర్వాత, ఊహించని విధంగా కురళ్, అగన్‌కు తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. మొదట్లో తిరస్కరించిన అగన్, తర్వాత తన ప్రేమను తెలుసుకుని ఆమె తండ్రిని ఒప్పించడానికి వెళ్తాడు.
అయితే, కథ ఇక్కడి నుంచే ఊహించని మలుపులు తిరుగుతుంది. కురళ్ తండ్రి, శక్తివంతమైన మంత్రి అథియమాన్ అళగప్పన్ (ఆర్. శరత్ కుమార్), వివాహానికి వెంటనే అంగీకరించినా, ఆ తర్వాత వెలుగులోకి వచ్చే కుటుంబ రహస్యాలు కథను ఉత్కంఠగా మారుస్తాయి. ముఖ్యంగా, అథియమాన్ తన చెల్లెలిని కులాంతర వివాహం చేసుకున్నందుకు చంపినట్లు వెల్లడించడం, రాజకీయ పలుకుబడి కోసం ఆ నేరాన్ని దాచడం వంటి చీకటి కోణాలు బహిర్గతమవుతాయి. కురళ్ మరొకరిని ప్రేమించడంతో, ఆ రెండు జంటల జీవితాలు , మంత్రి అథియమాన్ కఠినమైన పరువు హత్యల సిద్ధాంతం చుట్టూ కథనం అద్భుతంగా నడుస్తుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో 'డ్యూడ్'
ఈ మూవీలో శరత్ కుమార్ పాత్ర శక్తివంతంగా, డైనమిక్‌గా నిలవగా, రోహిణి, నేహా శెట్టి, హ్రిధు హరూన్ వంటి నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ హార్ట్, హ్యూమర్ ఫీల్‌గుడ్ రొమాంటిక్ డ్రామా ను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఓటీటీ విడుదల ద్వారా మరింతగా ప్రేక్షకులకు చేరువ అవుతుందంటున్నారు అభిమానులు.
