కరీంనగర్ చుట్టూ కరోనా వేస్టేజ్​​

కరీంనగర్ చుట్టూ కరోనా వేస్టేజ్​​

మున్సిపల్ చెత్తలోకి  కోవిడ్​ బయో వేస్టేజ్​ డంపింగ్​

శివారుల్లో డంప్​ చేస్తున్న మరికొన్ని దవాఖానాలు

 డబ్బులు ఖర్చవుతాయని దొంగ పనులు

 ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న హాస్పిటల్స్​

కరీంనగర్, వెలుగు:కరీంనగర్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కరీంనగర్​ జిల్లాలో 10వేలకు పైగా  పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం నగరంలో ఉండగా ఆ తర్వాత కేసులు పల్లెల్లో ఉన్నాయి. ప్రతి రోజు100కు పైగా కొత్త కేసులు వస్తున్నాయి.  కొన్నిసార్లయితే ఈ సంఖ్య రోజూ  200 వరకు ఉంటోంది.  నగరంలో  కరోనాకు గవర్నమెంట్​ హాస్పిటల్​తో పాటు  మరో 8 ప్రైవేటు దవాఖానాల్లో ట్రీట్​మెంట్​ ఇస్తున్నారు. కానీ ఇక్కడే ఓ సమస్య మొదలైంది. ఈ దవాఖానాల్లో కరోనా పేషంట్ల  బయో మెడికల్ వేస్టేజ్ ని ఇన్స్ లెటర్ వారికి అప్పగించకుండా మున్సిపల్ ట్రాక్టర్లలో వేస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో కరోనా ముప్పు పెరుగే అవకాశాలున్నాయని చాలామంది భయపడుతున్నారు.

ఇష్టమున్నట్టు వేస్తున్నరు

కరీంనగర్ లో కరోనా ట్రీట్​మెంట్​ చేసేందుకు మొదట్లో ప్రైవేటు దవాఖానాలకు  పర్మిషన్​ ఇవ్వలేదు. కానీ పేషంట్ల సంఖ్య పెరుగుతుండటంతో   ఫస్ట్​ రెండు హాస్పిటల్స్​కు అనుమతి ​ ఇవ్వగా  ఆ తరవాత ఈ సంఖ్య 11కి చేరింది.  కరోనా ఎక్కువవుతున్న తరుణంలో  అందరు పరిశుభ్రతకు  ప్రాధాన్యం ఇస్తుండగా దవాఖానాలు మాత్రం  ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ సమయంలో వినియోగిస్తున్న గ్లవ్స్, మాస్కులు, ఇంజెక్షన్లు, ట్యాబెట్లు, గ్లూకోజ్ బాటిల్స్​, పేషంట్లు, డాక్టర్లు వేసుకునే పీపీఈ కిట్లు, వీటితో పాటు ఫుడ్​కు సంబంధించిన వేస్జేజ్​, ఇతర వ్యర్థాలు ప్రతి రోజు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంటాయి. వీటిని కరీంనగర్  శివారులోని మానకొండూరు సమీపంలో ఏర్పాటు చేసిన బయో మెడికల్ వేస్టేజ్ ఇన్సులెటర్ కు  ప్రతి రోజు క్రమం తప్పకుండా పంపించాల్సి ఉంటుంది.  వీటిని దవాఖానాల్లోనే మూడు రకాలుగా విభజించాల్సి ఉంటుంది.  స్పెషల్​గా  తయారు చేసిన బ్యాగులు మూడు కలర్స్ లో ఉంటాయి. ఇందులో ఎల్లో కలర్​ బ్యాగ్​లో  కాటన్, బ్లడ్​ తదితర వ్యర్థాలు వేయాలి. రెడ్ బ్యాగ్ లో అన్ని రకాల  ప్లాస్టిక్ వస్తువులు, పీపీఈ కిట్లు వేయాల్సి ఉంటుంది. బ్లూ బ్యాగ్​లో షార్ప్ గా ఉండే బ్లేడ్లు, కత్తెర్లు, రాడ్స్ వంటి మెటల్స్ వేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క హాస్పిటల్​ పట్టించుకోవడం లేదు.

వేస్టేజ్ ఎటుపోతోంది?

నగరంలోని 11 హాస్పిటల్స్​లో 3 మాత్రమే నగరంలో ఉన్న వెంకటరమణ ఇన్సులెటర్ తో టైఅప్ కాగా మిగిలిన 8 దవాఖానాలు టై అప్​ కాలేదు. టై అప్​ అయిన దవాఖానాల నుంచి  ఇన్సులెటర్ నిర్వాహకులు  స్పెషల్​ వెహికల్​ తీసుకొచ్చి వేస్టేజ్​ తీసుకుపోతుంటారు.  దీనికి గాను దవాఖానాలో బెడ్ల సంఖ్యను బట్టి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.  సాధారణ బయో మెడికల్ వేస్టేజ్ అయితే  బెడ్ కు రూ. 6 , కోవిడ్​ అయితే  రూ. 250 తీసుకుంటారు. ​ కేవలం డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే ఒకే ఒక్క కారణంతో ఆ 8 హాస్పిటల్స్ టై అప్ కావడం లేదు. పోనీ నిబంధనల ప్రకారం వేస్టేజ్​ పంపిస్తున్నారా అంటే అదీ లేదు.  కాసులకు కక్కుర్తి పడి ఇంటి ముందరకు వచ్చే మున్సిపల్  చెత్త ట్రాక్టర్లలోనే  ఈ బయో మెడికల్ వేస్టేజ్ వేస్తున్నారు.  ప్రతి రోజు ఒక హాస్పిటల్ నుంచి ఎంత లేదన్నా ఒక ట్రిప్ వరకూ వేస్టేజీ ఉంటోంది.  ఇలా సుమారుగా 8 ట్రాక్టర్ల లోడ్ ను డంపింగ్ యార్డుకు  నిత్యం తరలిస్తున్నారు.  కొన్ని హాస్పిటల్స్​ అయితే  ట్రాక్టర్లను గుత్తకు  మాట్లాడుకుని ట్రిప్పుకు ఇంత ఇస్తామని చెప్పి.. నగరశివారుల్లో పడేస్తున్నారని సమాచారం.

ప్రజల ప్రాణాలతో చెలగాటం

కరీంనగర్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడ కరోనాకు ట్రీట్ మెంట్ చేస్తు న్న ప్రైవేటు దవాఖానాలు బయో మెడికల్ వేస్టేజీని ఇన్సులెటర్ వారికి అందించాల్సి ఉండగా.. నిర్లక్ష్యంగా మున్సిపల్ ట్రాక్టర్లలో వేస్తు న్నారు. దీని ద్వారా వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉంది . పరోక్షంగా ఈ దవాఖానాలే కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలి. దీనిపై కలెక్టర్ కు కూడా కంప్లయింట్ చేశాం.–ఎన్ శ్రీనివాస్, లోక్ సత్తా జిల్లా బాధ్యుడు

యమ డేంజర్

సాధారణ బయో మెడికల్ వేస్టేజీనే చాలా జాగ్రత్తగా బయట ఎక్కడా వేయకుండా ఇన్సులేటర్ల ద్వారా కాల్చి వేయాల్సి ఉంటుంది. అలాంటిది  ఈ భయంకరమైన కోవిడ్ బయో మెడికల్ వేస్టేజ్ ను ఇష్టమున్నట్టు పడేస్తున్నారు. ఎటువంటి రక్షణ లేకుండానే ట్రాక్టర్లలో జనావాసాల్లోంచి తరలిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లిన ఈ వేస్జేజీ వర్షానికి నీటిలో కలిస్తే ఇంకా ప్రమాదకరం. ఇటీవలే మురుగు నీటిలోనూ కరోనా ఆనవాళ్లను సైంటిస్టులు కనుగొన్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన దవాఖానాల  యాజమాన్యాలు  సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఉన్నతాధికారులు  స్పందించి కోవిడ్ దవాఖానాలతో పాటు  జనరల్ హాస్పిటల్స్​ లోనూ బయో మెడికల్ వేస్టేజీని బయట  పడవేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.