పెర్ల్ హార్బర్, 9/11 దాడి కన్నా కరోనా డేంజర్: ట్రంప్

పెర్ల్ హార్బర్, 9/11 దాడి కన్నా కరోనా డేంజర్: ట్రంప్

వాషింగ్టన్: రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన పెర్ల్ హార్బర్ దాడి కంటే కరోనా మహమ్మారి కారణంగా వచ్చే ప్రాణ, ఆస్తి నష్టం అమెరికాను తీవ్రంగా దెబ్బతీసిందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం అన్నారు. “వైరస్ ఎఫెక్టు పెర్ల్ హార్బర్ పై దాడి కంటే ఘోరంగా ఉంది, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై దాడి కంటే దారుణంగా ఉంది. ఇంతటి ఘోరం ఎప్పుడూ జరగకూడదు”అని ట్రంప్ కామెంట్ చేశారు. హవాయిలోని పెర్ల్ హార్బర్ నావికా స్థావరంపై 1941 లో జపాన్ దాడి చేసింది. ఈ దాడితో అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. 2001 సెప్టెంబర్ 11 న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై టెర్రరిస్టుల దాడిలో దాదాపు 3000 మంది చనిపోయారు. ఈ ఘటనతో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో టెర్రరిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు రెండు దశాబ్దాలకు పైగా అమెరికా చర్యలు తీసుకుంది. దేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఈ రెండు ఘటనలను ట్రంప్ గుర్తుచేశారు. ఇలాంటి దారుణ ఘటనల్లో జరిగిన దాని కంటే ఎక్కువగా ప్రస్తుతం అమెరికాలో ప్రాణ, ఆస్తి నష్టాలు అవుతున్నాయన్నారు. కరోనా బారిన పడి అమెరికాలో చనిపోయినవారి సంఖ్య 74 వేలు దాటింది.