సర్కారు బడులకు కార్పొరేట్ దన్ను..స్కూల్ క్యాంపస్ల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులు

సర్కారు బడులకు  కార్పొరేట్ దన్ను..స్కూల్ క్యాంపస్ల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులు

విద్యాశాఖతో రహేజా, రామ్‌‌‌‌కీ, యశోద సంస్థల సీఎస్ఆర్‌‌‌‌  ఒప్పందాలు
పేద పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తం: సీఎం రేవంత్​

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన రహేజా గ్రూప్, రామ్‌‌‌‌కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్‌‌‌‌ ముందుకు వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌‌‌‌) కింద ప్రభుత్వ బడుల ఆధునీకరణ, మౌలిక వసతులు కల్పించేందుకు విద్యాశాఖతో  అవగాహన కుదుర్చుకున్నాయి. ఈ మేరకు శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను అందజేశారు. 

రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌‌‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ స్కూల్​ క్యాంపస్​ నిర్మాణానికి రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా రూ. 50.50 కోట్ల నిధులు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్‌‌‌‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ కొత్త ప్రాంగణానికయ్యే  ఖర్చులో 40 శాతం వాటా కింద రూ. 19.66 కోట్లను, మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్‌‌‌‌పీహెచ్ఎస్ ఉన్నతీకరణ (ప్రీ-ప్రైమరీ నుంచి ఐదో తరగతి, ఇంటర్ నిర్మాణం) కోసం మరో రూ. 10.4 కోట్లను రామ్‌‌‌‌కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి అందజేశారు.

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ ఎంపీపీఎస్‌‌‌‌లో ప్రీ-ప్రైమరీ, 6, 7 తరగతుల వసతుల కోసం యశోదా హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు రూ. 12.20 కోట్లు కేటాయించడం విశేషం. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో సీఎస్‌‌‌‌ఆర్ నిధులను అందజేసిన కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలను సీఎం రేవంత్ రెడ్డి  ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆశయాలకు తగ్గట్టుగా, అత్యాధునిక మౌలిక వసతులతో ఈ మోడల్ క్యాంపస్​లను  తీర్చిదిద్దాలని, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. 

పేద పిల్లలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహిస్తామని  సీఎం పేర్కొన్నారు. ఈ భేటీలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఛైర్మన్ సి. శేఖర్ రెడ్డి, తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్​ఫ్రాస్టక్చర్​డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ ఎండీ గణపతి రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.