సీఐ మాతో అసభ్యంగా మాట్లాడిండు: కార్పొరేటర్ విజయారెడ్డి

సీఐ మాతో అసభ్యంగా మాట్లాడిండు: కార్పొరేటర్ విజయారెడ్డి

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లో తమతో సీఐ అసభ్యంగా మాట్లాడారని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆరోపించారు. బంజారాహిల్స్ సీఐ కార్పొరేటర్ గా  తన పట్లనే ఇలా దురుసుగా ప్రవర్తిస్తే.. సామాన్య మహిళలు పోలీస్ స్టేషన్ కు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బంజారాహిల్స్ పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని, వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళితే తమను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎందుకు అరెస్టు చేశారని అడిగితే పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి అడ్డుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తిరగొద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ కు వెళ్తున్నట్లు చెప్పానా అని పోలీసులను నిలదీశారు. నిరసన తెలపడానికి కూడా హక్కు లేదా అని అడిగారు. తాను ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా అనుమతి కావాలా అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపైనా ఆయన పోలీసులు ఏకిపారేశారు. ఆమెను ఎక్కడ్నుంచైతే తీసుకెళ్లారో అక్కడికి తీసుకురండి అని డిమాండ్ చేశారు. సర్పంచులకు తెలియకుండా రూ.35వేల కోట్లు దారి మళ్లించారన్న రేవంత్ రెడ్డి... 8ఏళ్లు పూర్తయినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేదని ఆరోపించారు. అసలు తనను ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన్ను పోలీసులు బలవంతంగా పోలీసుల జీపులోకి ఎక్కించుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు.