
- పత్తి రైతుల కోసం ప్రత్యేకంగా ‘కపాస్ కిసాన్ యాప్’: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో 122 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం
హైదరాబాద్, వెలుగు: దీపావళి తర్వాతి రోజు (ఈ నెల 21) నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు కొనుగోళ్లు కొనసాగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
శుక్రవారం హైదరాబాద్ కవాడిగూడలో మీడియాతో ఆయన మాట్లాడారు. పత్తి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్ కిసాన్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. 9 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌లో.. రైతుల సేద్యం వివరాలు ఉంటాయనికిషన్ రెడ్డి చెప్పారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని గ్రామాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఇతర అధికారులు గ్రామాలకు వెళ్లి దీనిపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. పత్తి రైతులు దళారులకు పంటను అమ్ముకొని మోసపోవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 45 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతోందని చెప్పారు.
గతంలో పత్తి క్వింటాలుకు రూ.4,050 ఉండేదని, ఇప్పుడు రూ.8,110 అందిస్తున్నామన్నారు. పదేండ్లలో వంద శాతం కనీస మద్దతు ధరను పెంచి సీసీఐ కొనుగోలు చేస్తోందని వివరించారు. 12% తేమ మించకుండా రైతులు పత్తిని సిద్ధం చేసి జిన్నింగ్ మిల్లుల వద్దకు తీసుకురావాలని సూచించారు.
పత్తి కొనుగోలు విషయంలో రైతులకు మోసం జరిగినట్లు అనుమానాలు ఉంటే జిల్లా స్థాయి, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ దృష్టికి తీసుకుపోవాలని చెప్పారు. నకిలీ విత్తనాల అంశంపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే కొన్ని కంపెనీలను సీజ్ చేశామని గుర్తుచేశారు.
ఈ నెల 31 నుంచి సర్దార్@ 150 యూనిటీ మార్చ్..
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘సర్దార్ @ 150 యూనిటీ మార్చ్’పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.ఈ నెల 31 నుంచి నవంబర్ 15 వరకు జిల్లా స్థాయిలో పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాకు రూ.4.5 లక్షల బడ్జెట్‌ను ఇస్తున్నట్టు వెల్లడించారు.
స్కూళ్లు, కాలేజీల్లో వ్యాస రచన పోటీలు, డిబేట్, సెమినార్లు, హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజూ 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తామని వివరించారు. నిజాంల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించడంలో పటేల్ పాత్ర మరిచిపోవద్దన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు రాష్ట్ర కన్వీనర్‌గా కొల్లి మాధవి, కోకన్వీనర్‌గా వీరేందర్ గౌడ్, సభ్యుడిగా పవన్ రెడ్డిని నియమించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.