చెప్పిన పని చేయడం లేదని  ..  శానిటరీ ఇన్​​స్పెక్టర్​ను తిట్టిన కౌన్సిలర్ భర్త

చెప్పిన పని చేయడం లేదని  ..  శానిటరీ ఇన్​​స్పెక్టర్​ను తిట్టిన కౌన్సిలర్ భర్త

ఇల్లెందు, వెలుగు : తాని చెప్పిన పని చేయడం లేదంటూ ఓ కౌన్సిలర్ భర్త శానిటరీ ఇన్​​స్పెక్టర్​ ను అసభ్యపదజాలంతో దూషించాడు. అంతే కాకుండా అంతు చూస్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన సదరు ఆఫీసర్ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం ఇల్లెందులో జరిగింది. ట్రేడ్ లైసెన్స్ జారీ విషయంలో ఇల్లందు మున్సిపల్ శానిటరీ ఇన్​​స్పెక్టర్​ రాధాకృష్ణ, కౌన్సిలర్ యలమందల వీణ భర్త, మాజీ కౌన్సిలర్ వాసు మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన వాసు శానిటరీ ఇన్​​స్పెక్టర్​ ను నోటికి వచ్చినట్టు దూషించాడు. పక్కనే ఉన్న ఇతర సిబ్బంది, మరో కౌన్సిలర్ ఆజామ్ నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఇన్​​స్పెక్టర్​ రాధాకృష్ణ కంటతడి పెట్టుకున్నాడు. గొడవ జరుగుతున్న టైంలో మీటింగ్ హాల్ లో కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పటికీ ఎవరూ స్పందించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

2020 నుంచి లైసెన్స్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్రు


పొదిల కళావతి పేరిట ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసుకున్నారని 2020 నుంచి 2023 వరకు లైసెన్స్ పొందినట్లు ఇవ్వాలని యలమందల వాసు ఒత్తిడి చేస్తున్నారని శానిటరీ ఇన్​​స్పెక్టర్​ రాధాకృష్ణ చెప్పారు. అయితే తాను 2022లోనే ఇల్లందు మున్సిపాలిటీలో డ్యూటీలో చేరానని, కాబట్టి అలా ఇవ్వడం కుదరని చెప్పానన్నారు. ఇదే విషయాన్ని కమిషనర్, జేవోకు కూడా చెప్పానన్నారు. అయినా వినకుండా తాను చెప్పినట్లు లైసెన్స్ ఇవ్వాల్సిందేనని వాసు ఆగ్రహం వ్యక్తం చేశారని వాపోయారు. అతడిపై మున్సిపల్ కమిషనర్, చైర్మన్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.