బాలాపూర్‌‌: నకిలీ నోట్ల ముఠా అరెస్ట్‌‌..రూ.2.91 లక్షల దొంగ నోట్లు స్వాధీనం

బాలాపూర్‌‌: నకిలీ నోట్ల ముఠా అరెస్ట్‌‌..రూ.2.91 లక్షల దొంగ నోట్లు స్వాధీనం
  •     ముగ్గురు అరెస్ట్​

బాలాపూర్‌‌/గండిపేట, వెలుగు: నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్‌‌లో చెలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కమిషనర్స్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌(శంషాబాద్‌‌ జోన్‌‌), బాలాపూర్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. నిందితుల నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటింగ్‌‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్‌‌ జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ డి.కృష్ణమోహన్‌‌, బాలాపూర్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ సుధాకర్‌‌ తెలిపారు. చింతల్‌‌తండా, వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన రామావత్‌‌ రాము అలియాస్‌‌ మహమ్మద్‌‌ (36), రామావత్‌‌ మోతీలాల్‌‌ (35), రామావత్‌‌ గాంధీ (19)లను అరెస్ట్‌‌ చేశారు. నాగోల్‌‌, బండ్లగూడకు చెందిన సుధీర్‌‌ జాన్‌‌ చేలా అలియాస్‌‌ వంశీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

యూట్యూబ్‌‌ వీడియోలు చూసి..

ప్రధాన నిందితుడైన రాము రాపిడో ఆటోడ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బంధువు మోతీలాల్‌‌తో కలిసి యూట్యూబ్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన వీడియోలు చూశారు. యూట్యూబ్‌‌లో లభించిన ఓ ఫోన్‌‌ నంబర్‌‌ ద్వారా సంప్రదించి ప్రింటర్‌‌, స్కానర్‌‌, బాండ్‌‌ పేపర్లను కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

ప్రింటింగ్‌‌ పరికరాలతో అసలు నోట్లను పోలిన వాటర్‌‌మార్క్‌‌లతో నకిలీ నోట్లను తయారు చేశారు. రాత్రివేళల్లో వైన్‌‌ షాపులు, కూరగాయల మార్కెట్లలో స్వల్ప మొత్తాల్లో వాటిని చెలామణి చేయడం ప్రారంభించారు. రాము మేనల్లుడైన గాంధీ ద్వారా కూడా నకిలీ నోట్లను మార్కెట్‌‌లో సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారంతో టాస్క్‌‌ఫోర్స్‌‌, బాలాపూర్‌‌ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌‌ చేశారు. నకిలీ నోట్లు, ప్రింటింగ్‌‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.