జగిత్యాల జిల్లాలో దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. భూ వివాదంలో న్యాయం జరగలేదని ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడున్న స్థానికులు సమయానికి స్పందించి వారిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మోతె గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్ మండలం మోతె గ్రామానికి చెందిన రాజేష్ దంపతులు శుక్రవారం (మార్చి 6) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న వారు అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. వారిని గమనించిన స్థానికులు, పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
తమ పేరుపై ఉన్న 25 గుంటల భూమి,ఇంటిని అక్రమంగా రాజేష్ బాబాయి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. భూ రికార్డులు మార్పిడి చేయడంలో కొంతమంది పంచాయతీ సిబ్బంది ప్రమేయం ఉందని వారు ఆరోపించారు.
తమకు న్యాయం జరగాలని అధికారులను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని తెలిపారు. న్యాయం దొరకక విసిగిపోయి చివరికి ఆత్మహత్యాయత్నానికి దిగినట్లు రాజేష్ దంపతులు చెప్పారు.
