భూదాన్ భూముల ఆక్రమణపై 11 మందికి కోర్టు నోటీసులు

భూదాన్ భూముల ఆక్రమణపై  11 మందికి కోర్టు నోటీసులు
  •     వివరణ ఇవ్వాలని 
  • అధికారులకు ఆదేశం

సూర్యాపేట, వెలుగు: మేళ్లచెరువు సర్వే నంబర్ 1057లో ఉన్న 150 ఎకరాల పేదలకు చెందిన భూదాన్ భూములను మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ సంస్థలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై హుజూర్‌‌‌‌నగర్ కోర్టు 11 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్థానిక న్యాయవాది కమతం నాగార్జున మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ఎదుట ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సీసీఎల్ఏ కమిషనర్‌‌‌‌తో పాటు పలువురు అధికారులకు, మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. భూదాన్ బోర్డు కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్, హుజూర్‌‌‌‌నగర్ ఆర్డీవో, మేళ్లచెరువు తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారి, మేళ్లచెరువు ఎస్సై, జిల్లా ఎస్పీ, మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ సంస్థల ఎండీలతో సహా మొత్తం 11 మంది ఈ నెల 28న కోర్టులో హాజరై కౌంటర్​ దాఖలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. 

గత 10 సంవత్సరాలుగా భూదాన్‌‌‌‌కు చెందిన 150 ఎకరాల భూములను సిమెంట్ కంపెనీలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయని, దీనికి కొందరు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని నాగార్జున ఆరోపించారు. ఈ విషయంపై గతంలో హుజూర్‌‌‌‌నగర్ కోర్టులో ఫిర్యాదు చేసినప్పటికీ, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు పెండింగ్‌‌‌‌లో ఉండటంతో ఎటువంటి చర్యలు తీసుకోలేమని కోర్టు తెలిపిందన్నారు. ఇటీవల హైకోర్టులో కేసుకు తుది తీర్పు వెలువడడంతో భూదాన్ భూముల ఆక్రమణ అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది. మరోసారి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదు చేయగా, వాదనలు విన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.