హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 25న ట్రాఫిక్ హోంగార్డు పై దాడి చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ ఘటనలో హోంగార్డు ముఖానికి గాయాలు కావడంతో... అబిడ్స్ ట్రాఫిస్ ఎస్ఐ అనిల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు పసుపుల యశ్వంత్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ అబిడ్స్ జీపీవో వద్ద ట్రాఫిక్ ఎస్‌ఐ అనిల్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... సోమాజిగూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పసుపుల యశ్వంత్ తన తండ్రితో కలిసి హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తూ దొరికిపోయాడు. ఎస్‌ఐ ప్రశ్నించగా.. హెల్మెట్ కొనడానికే వెళ్తున్నాం అంటూ యశ్వంత్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఎస్‌ఐతో గొడవకు దిగాడు.పరిస్థితి చేయిదాటిపోతుండటంతో.. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు కుమార్ జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యశ్వంత్.. హోంగార్డు కుమార్ ముఖంపై బలంగా దాడి చేశాడు. ఈ దాడిలో హోంగార్డు ముఖానికి తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది.
అక్కడితో ఆగని నిందితుడు.. అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా వీరంగం సృష్టించాడు. స్టేషన్ లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తూ గందరగోళం సృష్టించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు నిందితుడు యశ్వంత్‌పై బిఎన్ఎస్ (BNS) సెక్షన్స్ 121(1), 118(1), 324(4), 352 292 కింద కేసులు నమోదు చేశారు. నిందితుడికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు అబిడ్స్ సీఐ పరశురామ్ తెలిపారు.
