పోలీస్ బిల్డింగ్స్ కట్టేందుకు 704 కోట్లు

పోలీస్ బిల్డింగ్స్ కట్టేందుకు 704 కోట్లు
  •     23 జిల్లాల్లో ఎస్‌‌పీ, సీపీ బిల్డింగ్ కాంప్లెక్స్‌‌ల నిర్మాణం 
  •     పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌‌ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో రూ.704.5 కోట్ల వ్యయంతో సీపీ, ఎస్‌‌పీ ఆఫీసులు, కొత్త పోలీస్ స్టేషన్ లకు బిల్డింగులు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్‌‌ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. కార్పొరేషన్ ఎండీ, అడిషనల్‌‌డీజీ రాజీవ్‌‌ రతన్‌‌తో కలిసి డీజీపీ ఆఫీస్‌‌లోని హౌసింగ్‌‌కార్పొరేషన్‌‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 జిల్లాల్లో ఎస్‌‌పీ ఆఫీస్ బిల్డింగ్స్‌‌, సిద్ధిపేట, కామారెడ్డి, రామగుండం, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌‌లను ప్రారంభించినట్లు దామోదర్ తెలిపారు. ములుగు, నారాయణపేట్‌‌లో మాత్రం భూమి దొరకడం లేదన్నారు. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్‌‌ బిల్డింగ్స్‌‌ను ఒక్కొక్కటి రూ.38.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా137 పోలీస్ స్టేషన్లకు కొత్త బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టగా109 పూర్తి అయ్యాయన్నారు. 

మరో 28 బిల్డింగ్స్‌‌ పూర్తికావస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 పోలీస్‌‌స్టేషన్లలో ఫ్రంట్ ఆఫీస్ నిర్మాణాలు చేపట్టగా 78 పనులు పూర్తి అయ్యాయన్నారు. పాత పోలీస్‌‌స్టేషన్, ఏసీపీ, డీసీపీ బిల్డింగ్స్ స్థానంలో రూ.175.68 కోట్లలో 67 కొత్త బిల్డింగ్స్‌‌ నిర్మించినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు, భద్రాచలం అటవీ ప్రాంతాలు, దక్షిణ తెలంగాణాలో నల్లమల అడవుల సమీపంలోని పోలీస్‌‌ స్టేషన్స్‌‌ను ఫైర్ ప్రూఫింగ్‌‌ సిస్టమ్‌‌తో నిర్మించామన్నారు. ఎలాంటి దాడులు జరిగినా తట్టుకునేలా నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఎక్సైజ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఫారెస్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌, మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థకు చెందిన నిర్మాణ పనులను కూడా చేపట్టి పూర్తి చేశామన్నారు.