దేశంలో ఫోన్లు రికవరిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీఎస్ పోలీసులు 1016 మొబైల్ లను రికవరి చేశారని..వాటిని యాజమానులకు అప్పగించామని చెప్పారు. ఫోన్ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధిక వడ్డీలకు ఆశపడి మోసపోవద్దని చెప్పారు.
మీడియాతో మాట్లాడిన సీపీ రమేష్ రెడ్డి.. IMEI నెంబర్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లు గుర్తించగలుగుతున్నాం. ప్రస్తుతం CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్లు గుర్తించడం ఈజీ అవుతుంది. CEIR లేనపుడు మెయిల్ ద్వారా ఆయా మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ లను సంప్రదించాల్సి వచ్చేది. ఇదంతా గతంలో మ్యాన్యూవల్ గా జరిగేది.. సెల్ ఫోన్ లను గుర్తించడం కూడా ఆలస్యం అయ్యేది. దీంతో కేంద్రం CEIR పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. CEIR డేటా బేస్ నుండి సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ లకు లింక్ అవుతుంది. దీంతో పోగొట్టుకున్న ఫోన్ వేరే వ్యక్తి వాడిన వెంటనే అలెర్ట్ వస్తుంది. వెంటనే ఫోన్ రికవరీ చేసే వెసులుబాటు ఉంటుంది. ఫోన్ విలువ తక్కువ అయినప్పటికీ అందులో డేటాతో పాటు డబ్బు కూడా చోరీ అయ్యే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ బాధితులుగా మారడానికి కూడా కారణం సెల్ ఫోన్. కాబట్టి జాగ్రత్తగా వినియోగించాలి..
ఫోన్ మత్తు పదార్థానికి ఏ మాత్రం తీసిపోదు.. అనవసరమైన వాటిపై క్లిక్ చేయవద్దు. మోసపోవద్దు. ముక్కు మొహం తెలియని వారు ఇన్వెస్ట్మెంట్ అంటే అత్యాశకు పోవద్దు. నమ్మకమైన బ్యాంక్ లను కాకుండా ప్రయివేట్ వ్యక్తుల ప్రలోభాలను నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దు. ఇటీవల సైబర్ క్రైమ్ నేరాలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సుమారు వందమంది పైగా సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాము. ఇవాళ 103 మంది సైబర్ క్రైమ్ బాధితులకు అకౌంట్ లను డీఫ్రిజ్ చేస్తున్నాం..63 లక్షలు పైగా డబ్బు ఈ 103 అకౌంట్ లలో ఫ్రీజ్ అయింది అని రమేష్ రెడ్డి తెలిపారు.
