V6 News

హైదరాబాద్ లో బ్యాంకులకు కొత్త చాలెంజ్

హైదరాబాద్ లో బ్యాంకులకు కొత్త చాలెంజ్
  •     ఒక్క కస్టమర్ కూడాసైబర్ నేరాల బారిన పడొద్దు
  •     సేఫ్ కస్టమర్, జీరో మ్యూల్ అకౌంట్స్ లక్ష్యంగా పనిచేయాలి
  •     సిటీ సీపీ సజ్జనార్ పిలుపు

బషీర్​బాగ్, వెలుగు: బ్యాంక్ ఖాతాల ఓపెనింగ్​టార్గెట్ల కంటే కస్టమర్ల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని సిటీ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ఒక్క కస్టమర్ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా బ్యాంకులు పనిచేయాలన్నారు. బంజారాహిల్స్​లోని టీజీఐసీసీసీలో గురువారం 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతాధికారులతో మ్యూల్ ఖాతాల నియంత్రణపై ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు ఉపయోగపడుతున్న మ్యూల్ ఖాతాలను పూర్తిగా అరికట్టేందుకు ‘సేఫ్ కస్టమర్ చాలెంజ్’ను బ్యాంకులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి బ్యాంకు శాఖ ‘జీరో మ్యూల్ అకౌంట్స్’ లక్ష్యంగా పనిచేయాలని, కస్టమర్ భద్రతను ఉద్యోగుల కీలక పనితీరుకు సూచికగా పరిగణించాలని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ కేవైసీ నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిని బ్యాంకింగ్ రంగం నుంచే బ్లాక్​లిస్ట్ చేయాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అధికారులకు సూచించారు.

‘మ్యూల్ హంటర్’​ను వాడాలి

కంబోడియా, వియత్నాం, దుబాయ్ దేశాల నుంచి పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలు స్థానికంగా ఉన్న బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై నేరాలకు పాల్పడుతున్నాయని, ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో భాగంగా ఇప్పటివరకు 850 కేసుల్లో రూ.150 కోట్ల మోసాన్ని గుర్తించి, 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఫిక్స్​డ్ డిపాజిట్లను అకస్మాత్తుగా క్లోజ్ చేయడానికి వచ్చే కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారు నేరగాళ్ల ఒత్తిడిలో ఉన్నారా అన్నది పరిశీలించాలని కోరారు. 

‘మ్యూల్ హంటర్’ వంటి సాంకేతికతను వాడుతూ, 1930 హెల్స్​లైన్​పై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నెట్​వర్క్​ను నిర్మూలించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని, బ్యాంకులు పోలీసులతో పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీ శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు.