కాంగ్రెస్​తోనే సీపీఐ.. రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తు

కాంగ్రెస్​తోనే సీపీఐ.. రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తు
  • కొత్తగూడెం సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలు

హైదరాబాద్, వెలుగు : ఎట్టకేలకు కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదించగా, దాన్ని సీపీఐ అంగీకరించింది. సోమవారం మగ్దుంభవన్​కు ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ విష్ణుదాస్​తో కలిసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి తదితరులతో రేవంత్ చర్చలు జరిపారు. బీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు కలిసి రావాలని సీపీఐ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఒక ఒప్పందానికి వచ్చామన్నారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య స్పష్టంగా పొత్తు ఖరారైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని ఏఐసీసీ ఆదేశించినట్టు వెల్లడించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని చెప్పారు. పేదల తరఫున నిలబడేందుకు, పెద్దమనుసుతో ముందుకురావాలని తాము చేసిన విజ్ఞప్తికి సీపీఐ అంగీకరించిందని చెప్పారు. మునుగోడు శాసనసభ అంశంపై కూడా చర్చ జరిగిందని, అక్కడి నుంచి సీపీఐ ప్రతిపాదించే వారికి చట్టసభలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సమస్యలపై కలిసి పోరాటం, ఎన్నికల ప్రచారం, ఓటు బదిలీపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. సీపీఐ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల్లో పరస్పర అవగాహన ఒక చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణించారు. సీపీఎంతోనూ జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో కలిసి వస్తుందనే ఆశ ఉందని ఆయన వెల్లడించారు.

అనివార్య పరిస్థితుల్లో ఒకే స్థానంలో పోటీ: కూనంనేని

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సానుకూల పవనాలున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. అనివార్య పరిస్థితుల్లోనే కొత్తగూడెం ఒకే స్థానంలో పోటీకి అంగీకరించామని చెప్పారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల గొంతు వినిపించాలని, కష్టజీవులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.  మునుగోడులో కూడా బీజేపీని ఓడిచేందుకే బీఆర్ఎస్ కు మద్దతిచ్చామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మిత్రులుగామారిన పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ తో స్నేహంగా ఉన్నామని, తాము సహజ మిత్రులమని చెప్పారు. సీపీఎంతో సీపీఐ మితృత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్​ విముక్తి కోసమే :  నారాయణ

బీఆర్ఎస్​చేతిలో దగాపడిన ప్రజానీకాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ నియంత పాలన కొనసాగడం సాధ్యం కాదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు తేడా లేదని, అవన్నీ కుక్క మూతి పిందలేనని పేర్కొన్నారు. దేశంలో ప్రత్యామ్నాయం పేరుతో ఇండియా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి పెట్టేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడం, బండి సంజయ్​ను ఇంటికి పంపించడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గల అవగాహనను తెలుపుతున్నదని విమర్శించారు.