ఓట్లు వేసేది అందాల భామలు కాదు పేదలు..అగ్ని ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వాలి : కె.నారాయణ

ఓట్లు వేసేది అందాల భామలు కాదు పేదలు..అగ్ని ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వాలి : కె.నారాయణ
  • పేదలకు ఇంటి స్థలాలు దక్కేవరకు పోరాడుతం
  • సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: పేదలకు ఇంటి స్థలాలు దక్కేవరకు పోరాడుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం ఆయన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలసి పరిశీలించారు. గుడిసెవాసులను పరామర్శించారు. ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం బాధితులను పరామర్శించక పోవడం దారుణం అన్నారు.

ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.లక్ష ఇవ్వాలన్నారు. అందాల పోటీల నిర్వహణలో నిమగ్నమైన రేవంత్ సర్కార్ ఒక్కసారైనా నష్టపోయిన పేదల వైపు చూడాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేసేది అందాల భామలు కాదు.. నిరుపేదలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన వెంట సీపీఐ నేతలు అందోజ్ రవీంద్ర చారి, పాలమాకుల జంగయ్య, ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు, పల్లె నర్సింహ, పబ్బతి లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర్ హరిసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ వినతి మేరకు విజయవాడ పాపులర్ షూ మార్ట్ యాజమాన్యం నిరాశ్రయులకు దుప్పట్లు, టవల్స్, బకెట్లు అందజేశారు.