హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ అబద్ధాలకు, అహంభావానికి విద్యార్థుల ఉద్యమం గట్టి సమాధానం చెప్పిందని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అన్నారు. ‘కాక్రోచ్’ పేరుతో యువత చేపట్టిన ఉద్యమం విజయవంతమైందని తెలిపారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా విద్యార్థులు వెనక్కి తగ్గకుండా పోరాడారని చెప్పారు. విద్యార్థుల పోరాటానికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠమన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, సీజేఐ ఇద్దరూ సమాజం ముందు ముద్దాయిలుగా నిలబడ్డారని నారాయణ ఆరోపించారు.
విద్యార్థుల పోరాటానికి కేంద్రం దిగొచ్చింది: పల్లా వెంకటరెడ్డి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థులు, యువత చేసిన సుదీర్ఘ పోరాటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగించి విజయం సాధించిన విద్యార్థులు, యువతను ఆయన అభినందించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థులు, యువత చేసిన పోరాటం చారిత్రాత్మకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
