- అందుకే అమెరికా దాడులను ఖండించట్లేదు: డి.రాజా
- ఇతర దేశాలను బెదిరించే అధికారం
- యూఎస్‌కు ఎక్కడిది?
- కాంగ్రెస్, కమ్యూనిస్టులకే చరిత్ర ఉన్నది..
- ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎక్కడుందని ప్రశ్న
- ట్రంప్‌కు బానిసగా మోదీ: నారాయణ
- సీపీఐ సిద్ధాంతాలు ఎప్పటికీ ఉంటయ్: కూనంనేని
- ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ
ఖమ్మం టౌన్, వెలుగు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. ఇతర దేశాలపై అమెరికా దాడులు చేస్తున్నా, కనీసం ఖండించడం లేదని మండిపడ్డారు. ‘‘ట్రంప్ డిక్టేటర్లాగా, మరో హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారు. ఇతర దేశాలను బెదిరించే అధికారం ఆయనకు ఎక్కడిది? రష్యా నుంచి క్రూడాయిల్ కొనొద్దని ఇండియాను బెదిరించారు. ప్రధాని మోదీ కూడా అమెరికాకు సరెండర్ అవుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పాలస్తీనాపై దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీశాయి. వెనెజువెలాపైనా అమెరికా దాడులు చేసింది. కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ తలవంచి.. కనీసం అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటు” అని అన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ.. తమ పార్టీ వందేండ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్నదని చెప్పారు.
‘‘దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అత్యంత కీలక ఘట్టం. 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించింది. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఒక రాజకీయ చరిత్ర ఉంది. కాంగ్రెస్ కన్నా ముందే సంపూర్ణ స్వాతంత్య్రానికి సీపీఐ పిలుపునిచ్చింది. వందేండ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న ఆర్ఎన్ఎస్‌కు అసలు చరిత్రే లేదు. స్వాతంత్య్ర పోరాటంలో, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి?” అని ప్రశ్నించారు. అసలు ఎలాంటి చరిత్ర లేనివాళ్లు దేశభక్తులుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబు.. మా ఎర్రదండును చూడు: నారాయణ
తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిజం లేదని చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు.. ఒకసారి ఖమ్మం శతాబ్ది ఉత్సవాల్లోని ఎర్రదండును చూడాలని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. ‘‘ట్రంప్.. అంతర్జాతీయ టెర్రరిస్టు. ట్రంప్‌కు బానిసగా మోదీ వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 85 కోట్ల మంది ప్రజలకు రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం రూ.28 లక్షల కోట్లు రాయితీగా ఇచ్చింది” అని మండిపడ్డారు.
అందుకే సీఎంకు ఆహ్వానం: కూనంనేని
భూమిపై మనిషి బతికి ఉన్నంతకాలం సీపీఐ సిద్ధాంతాలు ఉంటాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని సభకు ఎందుకు పిలిచారని చాలా మంది నన్ను అడిగారు. ఆనాడు కాంగ్రెస్, సీపీఐ కలిసి ప్రజాసమస్యలపై పోరాడాయి. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ.. సీఎం రేవంత్ నాకు సొంత తమ్ముడిలాగా కనిపిస్తారు. సీఎంగా ఏనాడూ భేషజాలు చూపలేదు. పార్టీ నిర్ణయం మేరకే రేవంత్‌ని సభకు ఆహ్వానించాం” అని తెలిపారు. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల, సీపీఐ జాతీయ నేతలు అమర్ జిత్ కౌర్, బికె టాంగో, రామకృష్ణ పాండా, అనిరాజా, గిరిశర్మ, కె.ప్రకాశ్ బాబు, పువ్వాడ నాగేశ్వరరావు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, క్యూబా, వెనెజువెలా, వియత్నాం, కొరియా, నేపాల్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, సభకు ముందు నగరంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.
